
కొచ్చాడియన్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు రుణం కావాలని సెంట్రల్ బ్యాంకును యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేటు లిమిటెడ్ ఆశ్రయించింది. ఆ సంస్థకు సెంట్రల్ బ్యాంకు రూ.10 కోట్ల రుణం మంజూరు చేసింది. కానీ యాడ్ బ్యూరో సంస్థ వాయిదాల చెల్లింపులు సక్రమంగా జరపలేకపోయింది. దీంతో డెట్ రికవరీ ట్రిబ్యూనల్ ముందుకు ఈ దావా వెళ్లింది. దీంతో రూ.3.56 కోట్లను ఒకేసారి ఆ సంస్థ చెల్లించడంలో రుణ వివాదం పరిష్కారమైంది.
రుణ వివాదంపై సెటిల్ మెంట్ జరిగినప్పటికీ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సిబిల్)కు బ్యాంకు డిపాల్టర్ గా నివేదించిందని యాడ్ బ్యూరో ఆరోపించింది. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక (ఎన్సీడీఆర్సీ) ముందుకు ఈ విషయాన్ని తీసుకువెళ్లింది. బ్యాంకు తీరుతో తమ ప్రతిష్ఠ దెబ్బతిందని, వ్యాపారంలో నష్టాలు వచ్చాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ కంపెనీకి అనుకూలంగా ఎన్సీఆర్డీసీ తీర్పు చెప్పింది. వెంటనే రూ.75 లక్షల పరిహారం చెల్లించాలని సెంట్రల్ బ్యాంకును ఆదేశించింది, రుణ ఖాతా ఎటువంటి బకాయిలు లేకుండా పరిష్కరించబడిందని నిర్దారణ చేస్తూ సర్టిఫికెట్ జారీ చేయాలని తెలిపింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆ బ్యాంకు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
సెంట్రల్ బ్యాంకు అప్పీలును జస్టిస్ సుధాంషు ధులియా, ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారణ చేసింది. మొత్తం వివాదాన్ని పూర్తిగా పరిశీలన చేసి, తుది తీర్పును వెల్లడించింది. లాభార్జన కోసం బ్యాంకు నుంచి రుణం తీసుకున్న రుణగ్రహీతను వినియోగదారుల చట్టం కింద వినియోగదారుడిగా పరిగణించలేమని స్పష్టం చేసింది. రుణం తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం లాభార్జనే కాబట్టి .. రుణ గ్రహిత కు వినియోగదారుల చట్టం కిందకు రారని తెలిపింది. యాడ్ బ్యూరో సంస్థ రుణం నేరుగా లాభదాయకమైన కార్యకలాపాలకు వెచ్చించారని తెలిపింది. యాడ్ బ్యూరో అనేది ఒక ప్రకటనల సంస్థ. దీన్ని 1978లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి