
దేశ మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనాలు సందడి చేస్తున్నాయి. రోజూ ఒక కొత్త రకం మోడల్ స్కూటర్ దర్శనమిస్తోంది. అధునాతన ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. ప్రజలకు అందుబాటు ధరలలో, స్టైలిష్ లుక్ తో మతి పోగొడుతున్నాయి. ఈ స్కూటర్ల కొనుగోలుపై ఆయా కంపెనీలు ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నాయి. పికప్, వేగంగా, చార్జింగ్.. ఇలా అన్ని విధాలా మెరుగైన ఈ వాహనాలకు ఆదరణ ఎంతో బాగుంటోంది. అలాగే కంపెనీలు కూడా పలు ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో క్వాంటమ్ ఎనర్జీ స్టార్టప్ ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది. తన క్వాంటమ్ ప్లాస్మా ఎక్స్, ఎక్స్ఆర్ స్కూటర్లపై 10శాతం డిస్కౌంట్‌ను ప్రకటించాయి.
ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ అయిన క్వాంటమ్ ఎనర్జీ తన తాజా మోడళ్లు ప్లాస్మా ఎక్స్, ఎక్స్‌ఆర్ ఎలక్ట్రిక్ వాహనాలను తగ్గింపు రేట్లతో మార్కెట్ లోకి విడుదల చేసింది. వీటిపై పదిశాతం తగ్గింపు ధరను ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ తక్కువ కాలం ఉండదని తెలిపింది. గతంలో ప్లాస్మా ఎక్స్ రూ.1.20 లక్షలు, ఎక్స్ఆర్ రూ. 1 లక్ష ధర ఉండేవి. ప్రస్తుతం తగ్గించిన ధరలలో ప్లాస్మా ఎక్స్ రూ. 1.09 లక్షలు, ఎక్స్ఆర్ రూ. 89 వేలకు లభిస్తున్నాయి. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. అయితే ఈ ఆఫర్ మార్చి 31 వరకూ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం.
ప్లాస్మా ఎక్స్, ఎక్స్ఆర్ మోడళ్ల రెండు స్కూటర్లలో 1500 వాట్ల మోటార్, 60V 50Ah లిథియం-అయాన్ బ్యాటరీ అమర్చారు. పికప్ విషయానికి వస్తే ప్లాస్మా ఎక్స్ కేవలం 7.5 సెకన్లలోనే సున్నా నుంచి 40 కేఎమ్ పీహెచ్ వేగం ఎత్తుకుంటుంది. గంటకు 65 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్లవచ్చు. ఒక్కసారి చార్జింగ్ చేసుకుంటే సుమారు 110 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. ప్లాస్మా ఎక్స్ఆర్ గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లు. ఈ బండిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే సుమారు వంద కిలోమీటర్ల ప్రయాణం సాగించవచ్చు. వీటిలో ఎకో, స్పోర్ట్స్ అనే రెండు రకాలున్నాయి. రెండు మోడళ్లలో కీలెస్ స్టార్ట్, రివర్స్ గేర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఈ స్కూటర్లలో ఇంకా కొన్ని ప్రత్యేక ఆకర్షణలున్నాయి. ముందు, వెనుక ఎల్ఈడీ లైట్ సెటప్, బీఎమ్ఎస్, ఆన్ బోర్డ్ యూఎస్ బీ ఛార్జింగ్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ ఏర్పాటు చేశారు. వీటిపై కంపెనీ ఐదేళ్లు, లేదా 5 వేల కిలోమీటర్ల వరకూ వారంటీ ఇస్తుంది. ఈ రెండిటిలో ఏది ముందు వస్తే దానిని పరిగణనలోకి తీసుకుంటుంది. కొనుగోలుదారులు క్వాంటమ్ ఎనర్జీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో టెస్ట్ రైడ్ కోసం షెడ్యూల్ చేసుకునే అవకాశం కూడా ఉంది. లేకపోతే దేశంలోని ఈ కంపెనీ షోరూమ్ లకు వెళ్లి స్కూటర్లను పరిశీలించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..