Vande Bharat: బిగ్ న్యూస్.. ఈ రూట్లోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ఛార్జీలు వివరాలు వచ్చేశాయ్..

తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభంపై అధికారిక ప్రకటన వచ్చింది. తొలుత ఢిల్లీ-పాట్నా మధ్య తొలి రైలు ప్రవేశపెట్టాలని గతంలో రైల్వేశాఖ నిర్ణయించింది. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. తొలి వందే భారత్ రైలు ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై క్లారిటీ వచ్చింది.

Vande Bharat: బిగ్ న్యూస్.. ఈ రూట్లోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ఛార్జీలు వివరాలు వచ్చేశాయ్..
Vande Bharat Sleeper

Updated on: Jan 01, 2026 | 7:19 PM

వందే భారత్ స్లీపర్ రైళ్లు ఎప్పుడెప్పుడు వస్తాయోనని దేశ ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. త్వరలోనే పట్టాలపై పరుగులు పెడతాయంటూ ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నా.. మొన్నటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ట్రయల్ రన్స్ పూర్తై చాలా రోజులు గడిచినా ఇంకా రైళ్లను ప్రారంభించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ట్రయల్ రన్స్‌లో రైల్వేశాఖ కొన్ని సమస్యలు గుర్తించింది. వాటిని పరిష్కరించేందుకు సమయం తీసుకోవడంతో స్లీపర్ రైళ్లను ప్రారంభించడంలో జాప్యం జరిగింది. అయితే ఇప్పుడు ఎట్టకేలకు వందే భారత్ స్లీపర్ రైళ్ల ప్రారంభంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ జనవరి 1న ఢిల్లీలో రైళ్లు ప్రారంభంపై అధికారిక ప్రకటన చేశారు.

మోదీ చేతుల మీదుగా ప్రారంభం

తొలి వందే భారత్ స్లీపర్ రైలును హౌరా-గువహతి మధ్య ప్రధాని మోదీ త్వరలో ప్రారంభించనున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాబోయే 15 నుంచి 20 రోజుల్లో మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారని తెలిపారు. ఇప్పటికే హైస్పీడ్ ట్రయల్స్‌ను పూర్తి చేశామన్నారు. 16 కోచ్‌లు ఉండే స్లీపర్ రైలును వెయ్యి నుండి వెయ్యి ఐదు వందల కిలోమీటర్ల ప్రయాణానికి అనుగుణంగా తయారుచేసినట్లు తెలిపారు. వీటిల్లో సౌకర్యవంతమైన స్లీపర్ బెర్త్‌లు, ఆటోమెటిక్ సెన్సార్ డోర్స్, అత్యాధునిక టాయిలెట్లు ఉంటాయని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.

ఛార్జీల వివరాలు ఇవే..

అలాగే హౌరా-గువహతి మధ్య అందుబాటులోకి రానున్న తొలి వందే భారత్ స్లీపర్ రైళ్ల ఛార్జీల వివరాలను కూడా రైల్వేశాఖ మంత్రి అధికారికంగా ప్రకటించారు. ఈ రైల్లో ధర్డ్ ఏసీ ఛార్జ్ ఫుడ్‌తో సహా రూ.2,300గా నిర్ణయించగా.. సెకండ్ ఏసీ ధర రూ.3 వేలు, ఫస్ట్ ఏసీకి రూ.3,600గా ఉంటుందని స్పష్టం చేశారు. వందే భారత్ రైళ్లతో పోలిస్తే స్లీపర్ రైళ్లల్లో కాస్త అధికంగా ఛార్జీలు ఉండనున్నాయి. కానీ రాత్రుల్లో ప్రయాణించేవారికి లగ్జరీ ప్రయాణం అందనుంది. రాత్రి వేళల్లో ఎక్కువగా వీటిని తిప్పనున్నారు. రాత్రుల్లో సదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలనుకునేవారికి ఇవి బెస్ట్ ఆఫ్షన్‌గా చెప్పవచ్చు.