
ఈ ఆధునిక యుగంలో కుటుంబ పోషణ, పిల్లల చదువు, పెళ్లిళ్లు అనేది తల్లిదండ్రులకు భారంగా మారుతుంది. అందుకే పొదుపు అనేేది చాలా ముఖ్యం. భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేయడం ఇప్పుడు అందరికీ అత్యంత అవసరమైన విషయంగా మారింది. అయితే ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేని మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాల వారికి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఒక అద్భుతమైన మార్గంగా నిలుస్తోంది. ప్రతి నెలా చిన్న మొత్తాలను పొదుపు చేస్తూ, ఎటువంటి రిస్క్ లేకుండా పెద్ద మొత్తాన్ని కూడబెట్టుకోవడానికి ఈ పథకం దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందింది. కేంద్ర ప్రభుత్వ హామీ ఉండటం వల్ల ఇందులో మీ డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది.
ఈ పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీ ఖాతాను మీరు మీకు సమీపంలోని ఏదైనా పోస్ట్ ఆఫీస్‌కు వెళ్లి కేవలం రూ.100తోనే ప్రారంభించవచ్చు. ఆన్‌లైన్ బ్యాంకింగ్ సౌకర్యం ఉన్నవారు మొబైల్ యాప్ ద్వారా ఇంటి నుంచే సులభంగా పెట్టుబడి పెట్టడం ప్రారంభించే వీలుంది. దీని సాధారణ కాలపరిమితి 5 సంవత్సరాలుగా ఉంటుంది. అయితే ఈ పథకంలో అసలైన ప్రయోజనం ఎప్పుడు జరుగుతుందంటే.. ఈ 5 ఏళ్ల కాలపరిమితిని మరో 5 సంవత్సరాల పాటు పొడిగించి, మొత్తం 10 సంవత్సరాల పాటు కొనసాగించినప్పుడు పెట్టుబడిదారుడికి చక్రవడ్డీ రూపంలో లాభాలు భారీగా పెరుగుతాయి.
మీరు ప్రతిరోజూ రూ. 333 చొప్పున ఆదా చేయగలిగితే, నెలకు సుమారు రూ. 10,000 పొదుపు అవుతుంది. ఈ మొత్తాన్ని మీరు ఆర్‌డీలో ఇన్వెస్ట్ చేస్తే.. 5 సంవత్సరాలలో మీరు పెట్టే మొత్తం పెట్టుబడి రూ.6 లక్షలు అవుతుంది. ఐదేళ్ల మెచ్యూరిటీ తర్వాత వడ్డీతో కలిపి మీకు రూ. 7,13,659 అందుతాయి. ఇందులో వడ్డీ రూపంలోనే రూ. 1,13,659 లభిస్తుంది. ఒకవేళ మీరు ఈ పథకాన్ని మరో 5 ఏళ్లు పొడిగించి మొత్తం 10 సంవత్సరాలు కొనసాగిస్తే.. మీ మొత్తం పెట్టుబడి రూ.12 లక్షలు అవుతుంది. పదేళ్ల తర్వాత చక్రవడ్డీ మ్యాజిక్ వల్ల మీకు చేతికి అందే తుది మొత్తం అక్షరాలా రూ.17,08,546 అవుతుంది. అంటే కేవలం వడ్డీ రూపంలోనే మీరు రూ. 5,08,546 అదనంగా సంపాదించవచ్చు.
ఈ పథకంలో పెట్టుబడిదారుల కోసం మరికొన్ని అద్భుతమైన సదుపాయాలు కూడా ఉన్నాయి. ఖాతా తెరిచిన ఒక సంవత్సరం తర్వాత మీకు ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే మీ ఖాతాలోని మొత్తంలో 50శాతం వరకు రుణం తీసుకునే అవకాశం ఉంది. అలాగే ప్రతి నెలా డబ్బులు చెల్లించడంలో ఇబ్బంది పడేవారి కోసం, 6 నెలలు లేదా 12 నెలల మొత్తాన్ని ముందుగానే ఒకేసారి అడ్వాన్స్‌గా చెల్లించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. అనవసర ఖర్చులను తగ్గించుకుని, రోజుకు రూ.300కు పైగా పొదుపు చేయగలిగితే.. భవిష్యత్తులో పిల్లల చదువులు, పెళ్లిళ్లు లేదా ఇతర అవసరాల కోసం రూ. 17 లక్షల భారీ నిధిని సులభంగా సమకూర్చుకోవచ్చు.
ప్రశ్న: పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్‌ను ఎంత డబ్బుతో ప్రారంభించవచ్చు?
సమాధానం: ఈ ఖాతాను మీరు కేవలం రూ. 100 తోనే ప్రారంభించవచ్చు. ఆ తర్వాత ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు.
ప్రశ్న: అత్యవసర పరిస్థితుల్లో పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీ నుండి రుణం తీసుకోవచ్చా?
సమాధానం: అవును, తీసుకోవచ్చు. ఖాతా తెరిచిన ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత లోన్ తీసుకోవచ్చు.
ప్రశ్న: పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీ స్కీమ్ కాలపరిమితి ఎంత?
సమాధానం: సాధారణంగా పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీ కాలపరిమితి 5 సంవత్సరాలు ఉంటుంది. అయితే 5 ఏళ్ల తర్వాత మరో 5 ఏళ్లు పొడిగించుకోవచ్చు.
ప్రశ్న: ఈ పథకంలో చక్రవడ్డీ లాభం ఎలా లభిస్తుంది?
సమాధానం: ఈ పథకంలో వడ్డీ ప్రతి మూడు నెలలకు ఒకసారి లెక్కిస్తారు. కాలపరిమితి పెరిగేకొద్దీ వడ్డీపై వడ్డీ వచ్చి మంచి రాబడి వస్తుంది.