
దేశంలో సీనియర్ సిటిజన్లకు తమ డబ్బును సురక్షితంగా పెంచుకోవడానికి, పన్ను ఆదా చేసుకోవడానికి పోస్టాఫీస్‌లో ఎన్నో మంచి స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్, ఎఫ్‌డీ పథకాలు ప్రధానమైనవని చెప్పుకోవచ్చు. ఈ రెండు పథకాలకు 5 ఏళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అలాగే వీటిలో రూ.1.5 లక్షల వరకు పెట్టుబడిపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది. రిస్క్ లేని సురక్షితమైన పెట్టుబడులు కోరుకునే వారికి ఈ రెండూ సరైనవి.
ప్రస్తుతం నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ వడ్డీ రేటు 7.7శాతంగా ఉంది. ఈ వడ్డీని వార్షికంగా చక్రవడ్డీ చేస్తారు. అంటే వడ్డీపై కూడా వడ్డీ లభిస్తుంది. దీనికి విరుద్ధంగా.. 5 ఏళ్ల బ్యాంక్ ఎఫ్‌డీలు బ్యాంక్‌ను బట్టి సాధారణంగా 6.5శాతం నుంచి 7.5 శాతం మధ్య వడ్డీని అందిస్తాయి. సాధారణంగా చూస్తే.. NSC లో వడ్డీ రేటు కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల దీర్ఘకాలంలో మెరుగైన ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
పన్ను విషయంలో ఎన్ఎస్‌సీ కొంత ఎక్కువ ప్రయోజనం అందిస్తుంది. ఎఫ్‌డీలపై వచ్చే వడ్డీ ఆదాయం మొత్తంపై పన్ను కట్టాల్సి ఉంటుంది. అలాగే సీనియర్ సిటిజన్ల వడ్డీ ఆదాయం ఏడాదికి రూ.1 లక్ష దాటితే TDS తీసివేయబడుతుంది. అయితే NSC విషయంలో మెచ్యూరిటీకి ముందు మొదటి 4 ఏళ్ల వడ్డీని తిరిగి పెట్టుబడిగా పరిగణించి.. దాన్ని మళ్లీ 80C కింద పన్ను మినహాయింపు కోసం క్లెయిమ్ చేయవచ్చు. కేవలం ఐదవ ఏడాదిలో వచ్చే వడ్డీపై మాత్రమే పన్ను విధిస్తారు. ఎన్ఎస్‌సీలో మెచ్యూరిటీ వరకు TDS తీసివేయడం జరగదు.
రెండు పథకాలు అత్యంత సురక్షితమైనవే. ఎన్ఎస్‌సీకి కి భారత ప్రభుత్వ మద్దతు ఉంటుంది. బ్యాంక్ ఎఫ్‌డీలు DICGC ద్వారా ఒక్కో బ్యాంకుకు రూ.5 లక్షల వరకు బీమా చేయబడి ఉంటాయి. అధిక, చక్రవడ్డీతో కూడిన ఆదాయం, మెరుగైన పన్ను నిబంధనల కారణంగా NSC సీనియర్ సిటిజన్లకు కొంచెం బెటర్‌గా ఉంటుంది. అయితే సీనియర్ సిటిజన్లు వారి వ్యక్తిగత పన్ను స్లాబ్, పెట్టుబడి అవసరాల ఆధారంగా ఏ పథకం తమకు ఉత్తమంగా సరిపోతుందో నిర్ణయించుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి