
ఈ మధ్యకాలంలో చాలా మంది పోస్టాఫీస్ పథకాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ప్రభుత్వం గ్యారెంటీ, మంచి ఆదాయం ఉండడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా తమ పెట్టుబడికి పూర్తి భద్రతతో పాటు మంచి రిటర్న్స్ కోరుకునే వారికి పోస్టాఫీసు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఒక వరంలా మారింది. ప్రస్తుతం ఈ పథకం ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే మెరుగైన వడ్డీని అందిస్తూ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం NSC పథకంపై ప్రభుత్వం 7.7 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. ఈ పథకంలో మీరు ఒకేసారి రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే 5 సంవత్సరాల మెచ్యూరిటీ కాలం తర్వాత మీకు రూ. 14,49,035 లభిస్తాయి. అంటే కేవలం వడ్డీ రూపంలోనే మీరు రూ.4.49 లక్షల లాభాన్ని పొందుతారు. ఇందులో వడ్డీపై చక్రవడ్డీ ప్రయోజనం ఉండటం వల్ల మీ డబ్బు వేగంగా పెరుగుతుంది.
మీరు కనీసం రూ. 1,000 తో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడిపై ఎటువంటి పరిమితి లేదు. మీ స్తోమతను బట్టి ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ పథకం కాలపరిమితి 5 ఏళ్లు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద ఏడాదికి రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ప్రతి ఏటా జమ అయ్యే వడ్డీని తిరిగి పెట్టుబడిగా లెక్కగట్టడం ఈ పథకంలోని ప్రత్యేకత.
ఇండియన్స్ ఎవరైనా ఈ ఖాతాను తెరవవచ్చు. సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.10 ఏళ్లు దాటిన పిల్లలు తమ సొంత పేరుతో 10 ఏళ్లలోపు పిల్లల పేరు మీద తల్లిదండ్రులు ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. ఎన్ఆర్ఐ లేదా కంపెనీలకు ఈ పథకంలో పెట్టుబడి పెట్టే అవకాశం లేదు. రిస్క్ లేకుండా, ప్రభుత్వ హామీతో కూడిన సురక్షితమైన లాభాలను కోరుకునే మధ్యతరగతి కుటుంబాలకు NSC ఒక అద్భుతమైన ఎంపిక. భవిష్యత్తు అవసరాల కోసం భారీ నిధిని సమకూర్చుకోవాలనుకునే వారు ఈ పథకాన్ని పరిశీలించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి