PM Ujjwala Yojana: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ఇప్పటివరకు 9 కోట్ల మంది ప్రజలు ఉచిత LPG కనెక్షన్‌లను పొందారు. ఈ విషయాన్ని ఇండియన్ ఆయిల్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో వెల్లడించింది. ప్రభుత్వం ఈ పథకం కింద దేశంలోని APL, BPL, రేషన్ కార్డు కలిగిన మహిళలందరికీ ఉచితంగా LPG గ్యాస్ సిలిండర్, స్టవ్ అందజేస్తుంది. ఈ పథకం 1 మే 2016న ప్రారంభించారు. మీరు ఉచితంగా గ్యాస్ కనెక్షన్‌ను పొందాలనుకుంటే ముందుగా వెబ్‌సైట్‌కి వెళ్లాలి. తర్వాత అప్లై ఫర్ న్యూ ఉజ్వల 2.0 కనెక్షన్‌పై క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు ఇండేన్, భారత్ పెట్రోలియం, HP గ్యాస్ కంపెనీల పేర్లని చూస్తారు. వాటిలో ఏదైనా ఒకదానిని ఎంచుకోవాలి. ఆపై అవసరమైన సమాచారాన్ని నింపాలి. డాక్యుమెంట్లు ధృవీకరించిన తర్వాత మీ పేరుపై LPG గ్యాస్ కనెక్షన్ జారీ చేస్తారు. రెండో దశలో LPG కనెక్షన్‌తో పాటు ఉచితంగా మొదటి సిలిండర్‌ను రీఫిల్ చేసి ఇస్తారు.
ఈ పత్రాలు అవసరం
1. KYC చేయడానికి అవసరమైన పత్రాలు అందించాలి.
2. BPL రేషన్ కార్డ్ లేదా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డ్, అందులో మీరు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లు రుజువు ఉండాలి.
3. మీకు ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి కార్డ్ అవసరం.
4. బ్యాంక్ ఖాతా నంబర్, IFSC కోడ్ అవసరం.
5. ఒక పాస్‌పోర్ట్ సైజు ఫోటో తప్పనిసరి.
ఎవరు ప్రయోజనం పొందవచ్చు
ఈ పథకం ప్రయోజనం BPL కుటుంబాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఉచిత గ్యాస్ కనెక్షన్‌కి మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు 18 సంవత్సరాల దాటి ఉండాలి. వలస కార్మిక కుటుంబాలు రేషన్ కార్డు లేదా చిరునామా రుజువును దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు. దీనికి సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం సరిపోతుంది. ఈ పథకం కింద ఎల్‌పిజి కనెక్షన్‌ను జారీ చేయడం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. ఎటువంటి అభ్యర్థనలు వచ్చినా వెంటనే నమోదు చేయాలని ప్రభుత్వం ఎల్‌పిజి పంపిణీదారులను ఆదేశించింది.