రైతుల కోసం మోడీ సర్కార్ రైతుల కోసం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం ఒకటి. ఈ స్కీమ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6000 చొప్పున సాయం అందిస్తోంది. ఈ సాయం మూడు విడతల్లో రూ.2000 చొప్పున అందిస్తోంది. ఇప్పటి వరకు 12వ విడత డబ్బులు రైతుల ఖాతాల్లో చేరగా, ఇప్పుడు 13వ విడత రానుంది. ఈ సాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఇది వరకు ఈ మొత్తం జనవరి 28వ తేదీ లోగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయని భావించగా, ఇప్పటి వరకు అందలేదు. తాజాగా ఈ పీఎం కిసాన్ విడుదలకు సంబంధించి క్లారిటీ వచ్చింది. ఫిబ్రవరి 27న ప్రధాన నరేంద్ర మోడీ ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నారు. సోమవారం కర్ణాటకలో మోడీ పర్యనట ఉండటంతో అక్కడ ఈ డబ్బులను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నారు. ఈ 13వ విడత సుమారు 11 కోట్ల మందికి అందనుంది. నివేదికల ప్రకారం పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులకు ప్రధాని మోదీ సుమారు రూ. 16000 కోట్లు పంపిణీ చేయనున్నారు.
అయితే ఈ స్కీమ్‌లో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి. ఇలాంటి వాటిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అనర్హులు సైతం ఈ పథకం కింద డబ్బులు పొందుతున్నారు. అలాంటి వారిపై కేంద్ర అధికారులు ప్రత్యేక నిఘా పెడుతున్నారు. అనర్హులైన వారిన గుర్తించి జాబితా నుంచి ఏరివేసే పనిలో ఉంది కేంద్రం. ఇప్పటి వరకు డబ్బులు పొందిన వారిని గుర్తించి ఆ డబ్బులను రికవరీ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.
ఇక పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్న రైతులకు ఈ-కేవైసీ తప్పనిసరి చేసింది కేంద్రం. పీఎం కిసాన్ సాయం పొందుతున్న రైతులు ఈ కేవైసీ చేసుకోవడం తప్పనిసరి. ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ చేసుకోలేని రైతులకు ఈ 13వ విడత డబ్బులు అందవు. ఆధార్‌తో పాటు భూమికి సంబంధించిన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
మాజీ, లేదా ప్రస్తుత మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్, పంచాయతీ ప్రముఖులు, రాజ్యాంగ పదవిలో ఉన్నవారు అనర్హులు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, నెలవారీ పెన్షనర్లు, రిటైర్డ్ పెన్షనర్లు అనర్హులు.