AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ వడ్డీ జమ చేయడం ఆలస్యమైతే నష్టం జరుగుతుందా..? అసలు విషయం ఇదే..

ఈపీఎఫ్‌వో వడ్డీ ఖాతాల్లో ఎప్పుడు జమ అవుతుందోనని కోట్లాది మంది ఖాతాదారులు ఎదురుచూస్తున్నారు. నెలలు గడుస్తున్నా ఇంకా అకౌంట్లలో జమ కాలేదు. అయితే వడ్డీ జమ చేయడంలో ఆలస్యం కావడం వల్ల ఆర్ధికంగా నష్టం జరుగుతుందేమోనని చాలామంది భావిస్తున్నారు. కానీ ఏం జరుగుతుందంటే..

EPFO: పీఎఫ్ వడ్డీ జమ చేయడం ఆలస్యమైతే నష్టం జరుగుతుందా..? అసలు విషయం ఇదే..
Epfo
Venkatrao Lella
|

Updated on: Jun 02, 2026 | 7:52 PM

Share

ఈపీఎఫ్ బ్యాలెన్స్‌పై కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఆర్ధిక సంవత్సరంలో వడ్డీని అందిస్తోంది. ఆర్ధిక సంవత్సరం చివరిలో వడ్డీని నిర్ణయిస్తుంది. గత ఆర్ధిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.25 శాతం వద్ద స్థిరంగా ఉంచింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఇప్పటికే వడ్డీని ఫిక్స్ చేసి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు పంపించింది. 8.25 శాతంగా వార్షిక వడ్డీని ఈపీఎఫ్‌వో సిఫార్సు చేసినట్లు మార్చి 2న కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఈపీఎఫ్‌వో వడ్డీని ఫిక్స్ చేసి నెలలు గడుస్తోంది. 2026-27 కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభమై నెలలైనా ఇంకా వడ్డీ అనేది పీఎఫ్ ఖాతాల్లో జమ కాలేదు. దీంతో చాలామంది ఖాతాదారులు ఎప్పుడు పడతాయా అని ఎదురుచూస్తున్నారు.

ఆలస్యంగా పడితే నష్టం జరుగుతుందా..?

అయితే పీఎఫ్ వడ్డీ ఆలస్యంగా జమ అయితే నష్టపోతామని చాలామంది ఉద్యోగులు భావిస్తున్నారు. కానీ జాప్యం కావడం వల్ల ఎలాంటి నష్టం జరగదు. ఖాతాలో జమ అయ్యే నెలవారీ బ్యాలెన్స్ ఆధారంగా వడ్డీని లెక్కిస్తారు. ఆర్ధిక సంవత్సరం చివరిలో వాటిని జత చేస్తారు. దీంతో వడ్డీ ఆలస్యంగా జమ అయినా ఎలాంటి నష్టం జరగదు. అయితే గత ఏడాది జూన్, జులైలో వడ్డీని ప్రభుత్వం జమ చేసింది. దీంతో ఈ సారి కూడా అదే సమయానికి అందుకునే అవకాశముంది. గతంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో వీటిని జమ చేసేవారు. కానీ ఇటీవల గత కొన్నేళ్లుగా ముందుగానే జమ చేస్తూ వస్తోన్నారు. దీంతో ఈ నెల లేదా వచ్చే నెలలో అకౌంట్లో వడ్డీ సొమ్ము జమ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. కేంద్ర ఆర్ధికశాఖ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అకౌంట్లలో క్రెడిట్ చేయనున్నారు.

ఆలస్యం ఎందుకు జరుగుతుంది..?

ఈపీఎఫ్‌వో ప్రకటించిన వెంటనే వడ్డీని జమ చేయదు. ఇందుకోసం అనేక పరిపాలనా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఆమోదం అవసరం. అలాగే ఖాతాలను సయోధ్య చేయడం, సభ్యుల రికార్డులను అప్డేట్ చేయడం వంటి పనులకు కొన్ని నెలల సమం పడుతుంది.

వడ్డీ జమ అయిందో.. లేదో చూసుకోండిలా..

-ఈపీఎఫ్‌వో పోర్టల్‌లోకి వెళ్లండి

-యూఏఎన్ నెంబర్, పాస్ వర్డ్‌తో లాగిన్ అవ్వండి

-వ్యూ పాస్ బుక్‌పై క్లిక్ చేయండి

-అక్కడ ఉద్యోగి వాటా, యజమాని వాటా, పెన్షన్ వాటాతో పాటు వడ్డీ సొమ్ము కూడా కనిపిస్తుంది

-ఉమాంగ్ యాప్ ద్వారా కూడా ఇదే విధానంలో చూసుకోవచ్చు

Follow Us