ఒకవైపు భానుడి భగభగలు.. మరోవైపు నిత్యావసరాల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించనుంది. పెట్రోల్, డీజిల్ ధరలపై త్వరలోనే ఓ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వాటి ధరలను తగ్గించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ఈ ధరలను తగ్గించే అవకాశం ఉందని సమాచారం. గత సంవత్సరం నుంచి ఆయా సంస్థలు పెట్రోల్, డీజిల్ రోజూవారీ ధరల సవరణను తాత్కాలికంగా ఆపేశాయి. ఈ కంపెనీలు గత ఏడాది ఎదుర్కున్న నష్టాల నుంచి దాదాపుగా కోలుకుని సాధారణ స్థితికి చేరుకుంటున్నాయట.
ప్రస్తుతం ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని, రానున్న త్రైమాసికంలోనూ ఇదే ఫలితాలు రిపీట్ అవ్వొచ్చునని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. చమురు ధరల సవరణ చేయాలని నిర్ణయించే ముందు ఆయిల్ సంస్థలు మరో త్రైమాసికం(ఏప్రిల్-జూన్) వరకు వేచి చూసే అవకాశం ఉందని, ఎలాంటి నష్టాలు లేకపోవడంతో ధరలను కంపెనీలు తగ్గిస్తాయని ఆశిస్తున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. కాగా, ప్రతీ రోజూ ఉదయం పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటిస్తాయి ఆయిల్ సంస్థలు. స్థానిక పన్నులు, రవాణా ఛార్జీలు, వాట్ ఆధారంగా ఈ రేట్లలో మార్పులు ఉంటాయి.(Source)