Petrol Prices: దేశంలోని ఈ రాష్ట్రంలో పెట్రోల్ ధర చాలా తక్కువ.. ఎక్కడంటే..?
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల వాత సామాన్యులకు తప్పడం లేదు. దేశవ్యాప్తంగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం నాలుగోసారి ధరలు పెరగ్గా.. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధర ఎక్కువగా ఉండగా.. కొన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉంది. ప్రస్తుతం దేశంలోని ఏ రాష్ట్రంలో ధర ఎక్కువగా ఉందో చూద్దాం.

వాహనదారులకు షాక్ తగిలింది. పెట్రోల్, డీజల్ ధరలు మరోసారి పెరిగాయి. సోమవారం ఇంధన ధరలను కేంద్రం పెంచగా.. తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. 10 రోజుల్లో ఏకంగా నాలుగుసార్లు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దేశంలో నాలుగేళ్ల తర్వాత తొలిసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. మే 15న నుంచి ధరల పెరుగుదల అనేది కొనసాగుతోంది. నాలుగుసార్లు పెంచడంతో ఇప్పటివరకు లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.7 మేర పెరిగాయి. మే 15న లీటర్‌పై రూ.3 పెంచగా.. 19న 90 పైసలు పెంచారు. మే 23న పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంచారు. సోమవారం పెట్రోల్ ధరను రూ.2.61, డీజిల్ రూ.2.71 పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.102.13కి చేరుకోగా.. డీజిల్ రూ.95.20కి చేరుకుందని చెప్పవచ్చు.
మరింత పెరుగుతుందా..?
ఇక ముంబైలో పెట్రోల్ రూ.111.21గా ఉండగా.. డీజిల్ రూ.97.83కి పెరిగింది. ఇక చెన్నైలో పెట్రోల్ రూ.107.77గా ఉండగా.. డీజిల్ రూ.99.55కి చేరుకుంది. ఒకేసారి పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో దశల వారీగా పెంపును కేంద్రం అమలు చేస్తోంది. 2022లో రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్దంతో ముడి చమురు ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దీంతో అప్పట్లో మార్చి, ఏప్రిల్ మధ్య వరుసగా 13 రోజుల పాటు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచారు. 10 సార్లు 90 పైసల చొప్పున పెంచారు. ఇండియన్ ఆయిల్ 15 రోజుల్లోనే లీటర్ పెట్రోల్‌పై రూ.10 మేర పెంచింది. ఇప్పుడు నాలుగుసార్లు పెంచడంతో మరోసారి 2022 నాటి పెరుగుదల కనిపిస్తోంది. రానున్న కొద్ది రోజుల్లో ఇంధన ధరలను మరింత పెంచే సూచనలు కనిపిస్తున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
సయోధ్య కుదురుతుందా..?
అమెరికా-ఇరాన్ మధ్య సయోధ్య కుదిరి యుద్దానికి ముగింపు పలికితే హర్ముజ్ జలసంధి ఓపెన్ అవుతుంది. దీంతో ముడి చమురు రవాణా వ్యవస్థ మరింత మెరుగవుతుంది. అది జరిగితే ముడి చమురు ధరలు మరింత పతనమవుతాయి. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశముంటుంది. ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య సయోధ్యకు చర్చలు జరుగుతున్నాయి. త్వరలో ఈ చర్చలు సఫలమై శాంతి ఒప్పందం జరుగుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. హర్ముజ్ జలసంధి త్వరలో తెరుచుకుంటుందని, ముడి చమురు ధరలు పతనమవుతాయని అన్నారు.
పెట్రోల్ ధరలు ఎక్కడ తక్కువంటే..?
దేశంలోనే పెట్రోల్ ధరలు హైదరాబాద్‌లో అత్యధికంగా ఉండగా.. చండీగఢ్‌లో అత్యంత చౌకగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీట్ పెట్రోల్ రూ.112.18గా ఉండగా.. చండీగఢ్‌లో రూ.98.97గా ఉంది. ఇక చండీగఢ్‌లో లీటర్ డీజిల్ ధర రూ.86.94గా ఉంది. చండీగఢ్‌లో డీజిల్ ధర అతి తక్కువగా ఉంది.
