
ఇండియాలో ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహించాలంటే పాన్ కార్డు తప్పనిసరి. ఇది లేకుండా ఎలాంటి ఆర్ధిక కార్యకలాపాలు చేయలేం. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, లోన్ పొందాలన్నా, డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలన్నా, క్రెడిట్ కార్డు తీసుకోవాలన్నా, జీతం పొందాలన్నా, స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం వంటి పనులకు ఉపయోగపడుతుంది. ఇలా ప్రతీ అవసరానికి పాన్ కార్డు అవసరమవ్వడంతో దీనికి సంబంధించిన నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. వేరేవారి పాన్ కార్డులను తప్పుడు మార్గంలో సేకరించి రుణాలు పొందే నేరాలు ఇటీవల చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి వాటిని మీరు ఎలా పసిగొట్టాలి..? మీకు తెలియకుండా మీ పేరుపై లోన్ ఉంటే ఎలా తెలుసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
మీరు ఏదైనా బ్యాంక్ లేదా ఫైనాన్ష్ సంస్థ నుంచి లోన్ తీసుకోకపోయినా ఈఎంఐ కట్టమని మెస్సేజ్ లేదా కాల్స్ వస్తున్నాయా..? మీకు సంబంధం లేకపోయినా అలాంటి కాల్స్ వస్తుంటే వెంటనే జాగ్రత్త పడాల్సిందే. మీ పాన్ కార్డు ఉపయోగించి మోసగాళ్లు అక్రమంగా లోన్ తీసుకుని ఉండొచ్చు. వెంటనే మీరు అప్రమత్తమై సైబర్ క్రైమ్ పోలీసలుకు ఫిర్యాదు చేయడం లేదా బ్యాంకులు సంప్రదించాలి. ఇక ఇటీవల డిజిటల్ లోన్ యాప్‌లు కుప్పలు తెప్పలుగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. జస్ట్ పాన్ కార్డు ఉంటే చాలు.. వీటి ద్వారా లోన్ తీసుకోవచ్చు. వేరేవారి పాన్ కార్డుల ద్వారా అక్రమార్కులు ఈ లోన్ యాప్‌ల్లో నకిలీ ఖాతాలు సృష్టించి డబ్బులు తీసుకుంటున్నారు.
మీరు ఇలాంటి నకిలీ లోన్ల నుంచి తప్పించుకోవాలంటే.. మీ సిబిల్ స్కోర్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మీ క్రెడిట్ రిపోర్టులో మీరు తీసుకున్న లోన్ల వివరాలు అన్నీ కనిపిస్తాయి. సిబిల్ వెబ్‌సైట్లో ఏడాదికి ఒకసారి ఉచితంగా క్రెడిట్ రిపోర్ట్ చూసుకునే అవకాశం కల్పించింది. దీంతో సిబిల్ వెబ్‌సైట్లోకి వెళ్లి లోన్ వివరాలు చెక్ చేసుకోండి. మీరు తీసుకోకపోయినా ఏదైనా సంస్థ నుంచి లోన్ తీసుకున్నట్లు కనిపిస్తే అలర్ట్ అవ్వండి.
మీరు ఏదైనా లోన్ యాప్ నుంచి ఈఎంఐ చెల్లించమని నోటిఫికేషన్ వచ్చినా లేదా మెస్సేజ్ వచ్చినా మీ పాన్ కార్డుపై నేరగాళ్లు లోన్ పొంది ఉంటారని అర్థం చేసుకోవచ్చు. ఇక డిజిలాకర్‌లో మీ పాన్ కార్డుతో లింక్ చేయబడిన కేవైసీ వివరాలు కనిపిస్తాయి. మీకు తెలియని సంస్థ నుంచి కేవైసీ జరిగినట్లు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే. ఇక మీ పాన్ కార్డును తెలియని వ్యక్తులు, యాప్‌లకు ఇవ్వొద్దు. ఇక బ్యంక్ మెస్సేజ్‌లు, ఈమెయిల్స్‌ను ఎప్పుడూ ఆన్‌లో ఉంచుకోండి.