
కొత్తగా ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీపై మరింత భారం పడనుంది. దానికి కారణం వాటి రేట్లు పెరగనుండటమే. జనవరి 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన నిబంధనలతో వీటి రేట్లు అధికం కానున్నాయి. వీటి తయారీకి ఉపయోగించే కాపర్ ధరలు కూడా పెరిగాయి. దీంతో కంపెనీలకు తయారీ ఖర్చు పెరగడంతో ప్రజలపై భారం వేసేందుకు సిద్దమయ్యాయి. దీంతో పాటు డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనం కూడా ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరగడానికి కారణమవుతోంది.
ఏసీలు, ఫ్రిడ్జ్‌ల ధరలు 5 నుంచి 10 శాతం మేర పెరగనున్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో కేంద్రం ఎలక్ట్రానిక్ వస్తువులపై జీఎస్టీ రేట్లు తగ్గిండంతో వీటి ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. కానీ ఇటీవల వీటి విద్యుత్ సామర్థ్యానికి సంబంధించి కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి కరెంట్ వినియోగాన్ని సూచించే బ్యూర్ ఆఫ్ ఎనర్జీ(BEE) స్టార్ రేటింగ్స్‌లో మార్పులు చేసింది. జనవరి 1 నుంచి కేంద్ర రూల్స్ ప్రకారం 5 స్టార్ ఏసీలు 10 శాతం మరింత విద్యుత్‌ను ఆదా చేయనున్నాయి. వీటి తయారీలో నాణ్యతమైన పరికరాలు వాడాలనే నిబంధన విధించారు. దీంతో పాటు వీటి మేకింగ్‌కు వాడే కాపర్ ధరలు కూడా ఆమాంతం పెరిగాయి. దీని వల్ల ఏసీ, ఫ్రిడ్జ్‌ల ధరలు భారీగా పెరగనున్నాయి. ఏసీల ధరలు 5 నుంచి 7 శాతం వరకు, ఫ్రిడ్జ్‌ల ధరలు 3 నుంచి 5 శాతం వరకు పెరుగుతాయని తెలుస్తోంది.
ఇప్పటివరకు ఏసీ, టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్ లాంటి కొన్ని ఉత్పత్తులకు మాత్రమే బీఈఈ లేబుల్ తప్పనిసరి అనే నిబంధన ఉండేది. కానీ ఇప్పుడు ఎల్‌పీజీ గ్యాస్ స్టవ్స్, కూలింగ్ టవర్లు, చిల్లర్లకు సైతం స్టార్ రేటింగ్ లేబుర్ తప్పనిసరి చేసింది. దీంతో వీటి ధరలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటి తయారీకి ఉపయోగించే ముడి సరుకును విదేశాల నుంచి ఎక్కువగా భారత్ దిగుమతి చేసుకుంటుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కుప్పకూలడంతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీకి కంపెనీలకు ఖర్చు మరింత పెరగనుంది. ధరల పెరుగుదలకు ఇదొక కారణంగా కూడా తెలుస్తోంది.