Aadhaar Card: ఆధార్ కార్డు అప్డేట్ మరింత ఈజీ.. మీ ఊర్లోనే సేవలు.. ఈ తేదీల్లోనే..

ఆధార్ కార్డుల్లో మార్పులు చేసుకోవాలంటే ఆధార్ సెంటర్‌కు వెళ్లి గంటల కొద్ది వెయిట్ చేయాల్సి ఉంది. ఇక పిల్లల ఆధార్ పని కోసం వెళితే వారిని కూడా లైన్‌లో ఉంచాల్సి వస్తుంది. ఏపీలోని ప్రజలకు ఆ ఇబ్బంది లేదు. ఎందుకంటే ప్రత్యేక క్యాంపులు అందుబాటులోకి రానున్నాయి.

Aadhaar Card: ఆధార్ కార్డు అప్డేట్ మరింత ఈజీ.. మీ ఊర్లోనే సేవలు.. ఈ తేదీల్లోనే..
Aadhar Card Update

Updated on: Jan 02, 2026 | 10:14 PM

ఆధార్ కార్డుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల ఆధార్ కార్డుల్లో మార్పులు లేదా కొత్త ఆధార్ పొందాలంటే ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం సులభతరం చేసింది. గ్రామాల్లో ఉండే ప్రజలు తమ పిల్లలకు ఆధార్ కార్డు పొందాలన్నా లేదా అప్డేట్ చేసుకోవాలన్నా దగ్గర్లోని పట్టణానికి వెళ్లాల్సి వస్తోంది. అక్కడికి వెళ్లి పిల్లలతో పాటు క్యూలైన్లలో గంటల కొద్ది నిల్చోవాల్సి వస్తుంది. ఈ శ్రమను తగ్గించేందుకు ప్రభుత్వమే ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో ప్రత్యేక ఆధార్ క్యాంప్‌లను ఏర్పాటు చేస్తోంది. ఈ నెలలో ఐదు రోజుల పాటు ఈ స్పెషల్ క్యాంప్‌లు అందుబాటులో ఉండనున్నాయి. ఇక్కడికే తమ పిల్లలను తల్లిదండ్రులు తీసుకెళ్లి ఆధార్ కార్డుల్లోని వివరాలను అప్డేట్ చేయించవచ్చు.

ఐదు రోజుల పాటు క్యాంపులు

ఈ నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఆధార స్పెషల్ క్యాంపులు ఏపీలో ఏర్పాటు చేయనున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఇవి అందుబాటులోకి ఉండనున్నాయి. ఇక్కడ విద్యార్థుల బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయనున్నారు. ఏపీలోని 16.51 లక్షల మంది విద్యార్థులు తమ బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సిన అవసరముంది. కానీ ఇప్పటివరకు 5.94 లక్షలు మాత్రమే ఆ ప్రక్రియ పూర్తి చేశారు. ఇంకా 10.57 లక్షల మంది చేయించుకోవాల్సి ఉంది. అందుకే ఈ ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. గత నెలలో కూడా ఏర్పాటు చేయగా.. ఈ నెలలో కూడా అందుబాటులో ఉండనున్నాయి.

వీళ్లు తప్పనిసరి

15–17 ఏళ్ల జూనియర్ కాలేజ్ విద్యార్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్ చేయించుకోవాలి. ఇవి చేయించుకోకపోతే NEET , JEE వంటి పరీక్షలకు అనుమతి లభించకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు తమ సమీపంలోని స్కూళ్లు లేదా జూనియర్ కాలేజీలో జరిగే ఆధార్ స్పెషల్ క్యాంప్‌లకు వెళ్లి అప్డేట్ చేయించుకోవాలి.