
Bank Loans: ఏదైనా లోన్ తీసుకోవాలంటే వడ్డీ రేట్లను ముందుగా గమనిస్తాం. లోన్‌ను బట్టి వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. పర్సనల్ లోన్‌కు వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే.. హోం లోన్, ఎడ్యుకేషన్ లోన్, ఇతర లోన్లకు తక్కువ వడ్డీ ఉంటుంది. అయితే వడ్డీ లేని రుణాలు కొన్ని ఉన్నాయి. ఈ లోన్లు తీసుకోవడం వల్ల మీకు ఎలాంటి వడ్డీ పడదు. మీరు తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. వడ్డీ లేని రుణాలు ఎలా తీసుకోవాలి..? ఎక్కడ తీసుకోవాలి..? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఇప్పట్లో ప్రతీఒక్కరూ ఏదోక బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనేది వాడుతున్నారు. ఈ కార్డులపై 50 రోజుల పాటు వడ్డీ లేకుండా డబ్బులు వాడుకోవచ్చు. మీరు విత్ డ్రా చేసినా లేదా షాపింగ్, ఇతర అవసరాల కోసం విత్ డ్రా చేసినా వెంటనే చెల్లించాల్సిన అవసరం ఉండదు. గరిష్టంగా 50 రోజుల పాటు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఈ గ్రేస్ పీరియడ్ లోపు మీరు చెల్లిస్తే ఎలాంటి వడ్డీ ఉండదు. ఆ తర్వాత చెల్లిస్తే మాత్రం భారీగా ఛార్జీలు బ్యాంకులు వసూలు చేస్తున్నాయి.
క్రెడిట్ కార్డులపై మీరు ఆన్‌లైన్‌లో ఏవైనా వస్తులు కొనుగోలు చేస్తే నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్‌పై మీరు కొనుగోలు చేస్తే అదనంగా ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. నెల నెలా ఈఎంఐ రూపంలో మీరు ఖర్చు చేసిన అమౌంట్ చెల్లిస్తే సరిపోతుంది. కొన్ని ఫ్లాట్‌ఫామ్‌లు నో కాస్ట్ ఈఎంఐలపై స్వల్పంగా ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తున్నాయి. ఎక్కువగా పండుగలు, ప్రత్యేక ఆఫర్ల సమయంలో ఈ కామర్స్ వెబ్ సైట్లు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కల్పిస్తాయి. 6 నుంచి 24 నెలలలోపు వీటి వ్యవధి ఉంటుంది. ఆలోగా నెల నెల ఈఎంఐ రూపంలో చెల్లించాలి.
కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం కొన్ని పథకాలు ప్రవేశపెట్టింది. ఈ పథకాల ద్వారా బ్యాంకులు రైతులకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాయి. కేవలం రైతులకు మాత్రం ఈ రుణాలను బ్యాంకులు అందిస్తాయి. రైతులు వ్యవసాయ పనులు, విత్తనాలు, ఎరువుల కోసం వీటిని పెట్టుబడిగా వాడుకోవచ్చు. అలాగే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతులకు ప్రత్యేకంగా వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాయి.
కొన్ని కార్పొరేట్ కంపెనీలు తమ సంస్ధలో పనిచేసే ఉద్యోగులకు వడ్డీ లేకుండా లోన్లు మంజూరు చేస్తాయి. ఉద్యోగులకు అత్యవసరమైనప్పుడు వీటిని తీసుకోవచ్చు. ఉద్యోగి తీసుకున్న సొమ్మును ఈఎంఐ రూపంలో నెలనెల ఉద్యోగి జీతం నుంచి సంస్థలు కట్ చేసుకుంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి