
ఆర్ధిక అవసరాల కోసం బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంటూ ఉంటారు. అవసరాన్ని బట్టి రకరకాల లోన్లను బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయి. పర్సనల్ లోన్, హోమ్ లోన్, బిజినెస్ లోన్, వెహికల్ లోన్, మ్యారేజ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ లాంటివి చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మీ అవసరాన్ని బట్టి ఏ లోన్ అవసరమనుకుంటే అది తీసుకోవచ్చు. ఆ లోన్ ఏ అవసరానికి తీసుకుంటున్నారో దానికి సంబంధించిన ఆధారాలు సమర్పించాలి. అంతేకాకుండా ఏవైనా మీ స్థిరాస్తులు తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. ఇలా లోన్ తీసుకోవడానికి చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది.
లోన్ ఈఎంఐలు కొంతకాలం కట్టిన తర్వాత ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారిపోయి కొంతమంది కట్టలేకపోతుంటారు. ఇలాంటి సమయంలో లోన్ సెటిల్‌మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే మీరు చెల్లించాల్సిన లోన్‌లో కొంత మొత్తాన్ని తగ్గించి లేదా వడ్డీని మినహాయించి అసలు నగదును కట్టేలా బ్యాంకులతో సెటిల్మెంట్ చేసుకోవడమే. బ్యాంకుతో మీరు చేసుకున్న ఒప్పందం ప్రకారం కొద్ది రోజుల్లో నగదును చెల్లించాల్సి ఉంటుంది. ఇలా బ్యాంకులతో రుణాలు సెటిల్మెంట్లు చేసుకోవడం వల్ల మీరు చాలా నష్టపోతారు.
మీరు లోన్ కట్టలేక బ్యాంకులతో సెటిల్మెంట్ చేసుకున్నప్పుడు క్రెడిట్ స్కోర్ భారీగా పడిపోతుంది. మీరు బ్యాంకులతో సెటిల్మెంట్ చేసుకుని రుణం చెల్లించాక సెటిల్డ్ అకౌంట్‌గా క్రెడిట్ బ్యూరోకు బ్యాంకులు నివేదిస్తాయి. దీని వల్ల మీకు భవిష్యత్తులో రుణాలు ఏ బ్యాంకులు ఇవ్వడానికి ముందుకురావు. ఇక మీ సిబిల్ స్కోర్ 75 నుంచి 150 పాయింట్ల వరకు ఒక్కసారే పడిపోయే అవకాశముంది. ఏడేళ్ల పాటు క్రెడిట్ రికార్డుల్లో సెటిల్డ్ అని ఉండటం వల్ల మీకు ఏ బ్యాంకు నుంచి రుణాలు, క్రెడిట్ కార్డులు రావు.
క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలంటే మీ మిగతా ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులు సకాలంలో చెల్లిస్తూ ఉండాలి. కొత్తగా లోన్ల కోసం అప్లికేషన్లు పెట్టుకోకూడదు. మీ క్రెడిట్ రిపోర్టును ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి.