మహారాష్ట్రలో గణపతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. వారం రోజుల పాటు వినాయకులను ప్రతిష్టించి భారీ ఎత్తున పండగను జరుపుకొంటారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ముంబైలో భారీగా ఆస్తుల కొనుగోలు జరిగి గతేడాది రికార్డును కూడా బద్దలు కొట్టింది. అయితే వినాయకుని ఉత్సవాల సందర్భంగా క్రయ విక్రయాలు భారీగా జరుగుతుంటాయి. ఈ సమయంలో కొనుగోళ్లు చేస్తే మంచి జరుగుతుందని, అన్ని విధాలుగా శుభాలు జరుగుతాయని భావిస్తుంటారు. అయితే సెప్టెంబరు నెలలో ఈ ఆస్తి కొనుగోలు ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా డబ్బు సంపాదించింది. స్టాంపు డ్యూటీ నుంచి ప్రభుత్వం రూ.1,124 కోట్ల ఆదాయం సమకూరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి ఆస్తుల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వసూళ్ల పరంగా సెప్టెంబర్ నెల చాలా బాగుంది. 2022తో పోల్చితే 23 శాతం ఎక్కువ ఆస్తులు బుక్ చేయబడ్డాయి. స్టాంప్ డ్యూటీ వసూళ్లలో 53 శాతం పెరుగుదల నమోదైంది.
10000 కంటే ఎక్కువ ఆస్తులు అమ్ముడయ్యాయి
దేశంలోనే అతిపెద్ద, అత్యంత ఖరీదైన ప్రాపర్టీ మార్కెట్ అయిన ముంబైలో సెప్టెంబర్ నెలలో మొత్తం 10,602 ఆస్తులు రిజిస్టర్ అయ్యాయి. దీనిపై మొత్తం రూ. 1,124 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ సమాచారం మహారాష్ట్ర రిజిస్ట్రార్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్) డేటా ద్వారా తెలిసింది.
మహారాష్ట్రలో ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. సంవత్సరంలో ఈ అతిపెద్ద పండుగ సందర్భంగా ప్రజలు ఆస్తిపై పెట్టుబడి పెట్టడం శుభప్రదంగా భావిస్తారు. రాబోయే నెలల్లో నవరాత్రి, దీపావళి వంటి ప్రధాన పండుగలు రానున్నందున ఆస్తి కొనుగోళ్లు బారీగానే జరిగే అవకాశాలు ఉన్నాయని అక్కడ ప్రభుత్వం అంచనా వేస్తోంది.
50 శాతానికి పైగా ఆస్తులు కోటి రూపాయల కంటే ఎక్కువ..
సెప్టెంబరు నెల లో ముంబై లో నమోదైన మొత్తం ఆస్తులలో 82 శాతం నివాసాలు, 18 శాతం వాణిజ్య, ఇతర కేటగిరీ ఆస్తులు ఉన్నాయి. అయితే ముంబై రెసిడెన్షియల్ మార్కెట్ భారీ వృద్ధిని సాధిస్తోందని ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ తెలిపారు. ఈ విభాగం 10,000 ప్రాపర్టీ మార్కును దాటుతోందని అన్నారు. 2023 మొదటి 9 నెలల్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ బుకింగ్‌ల నెలవారీ సగటు 10,433 యూనిట్లు. ఇందులో 50 శాతానికి పైగా ఆస్తుల విలువ కోటి రూపాయల కంటే ఎక్కువ ఉంది.
1 కోటి కంటే ఎక్కువ ఆస్తుల విక్రయాలు గత కొన్నేళ్లు గా పెరిగాయి. జనవరి – సెప్టెంబర్ 2020 లో అమ్మకాలు 49 శాతంగా ఉన్నాయి. ఇది ఇప్పుడు జనవరి-సెప్టెంబర్ 2023లో 57 శాతానికి పెరిగింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి