
ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న ఖర్చులతో పాటు అవసరాలు చూస్తుంటే ప్రజల్లో కొత్త భయాన్ని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా రిటైర్‌మెంట్‌కు దగ్గరగా ఉన్న వారైతే మరింత ఆందోళన చెందుతున్నారు. రిటైర్‌మెంట్ బెనిఫిట్ సొమ్ము ఒకేసారి చేతికి వచ్చినా నెలవారీ ఖర్చులు ఎలా? అనే విషయాన్ని ఆలోచిస్తున్నారు. అయితే ఇలాంటి వారిని పెట్టుబడి వైపు ప్రోత్సహించి నెలవారీ రాబడినిచ్చే వివిధ పథకాలు అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. తాజాగా ప్రముఖ బీమా రంగ సంస్థ అయిన ఎల్ఐసీ అలాంటి పథకాన్ని లాంచ్ చేసింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) కొత్త పెన్షన్ స్కీమ్ సరళ్ పెన్షన్‌తో ముందుకు వచ్చింది. ఇందులో పాలసీదారుడు తన జీవితాంతం ఒకసారి ప్రీమియం చెల్లించడం ద్వారా పెన్షన్ పొందవచ్చు. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ సరల్ పెన్షన్ స్కీమ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఎల్ఐసీ సరళ్ పెన్షన్ స్కీమ్‌ను పొందడానికి రెండు ఎంపికలు ఉన్నాయి. ఒకటి జీవితాంతం పెన్షన్ పొందేందుకు, మరొకటి చివరిగా జీవించి ఉన్న వ్యక్తి మరణించినప్పుడు కొనుగోలు చేసిన ధరపై 100 శాతం రిటర్న్‌తో ఉమ్మడి జీవిత వార్షికాదాయాన్ని పొందే ప్లాన్. మొదటి ఆప్షన్‌లో పాలసీదారు జీవించి ఉన్నంత వరకు యాన్యుటీ చెల్లింపులు బకాయిల్లోనే చేస్తారు. వ్యక్తి మరణించినప్పుడు, యాన్యుటీ చెల్లింపులు వెంటనే ఆగిపోతాయి. నామినీకి 100 శాతం మొత్తం చెల్లిస్తారు. రెండో ఎంపికలో వ్యక్తి లేదా అతని జీవిత భాగస్వామి జీవించి ఉన్నంత వరకు యాన్యుటీ మొత్తానికి సంబంధించిన బ్యాలెన్స్ చెల్లిస్తారు. జాయింట్ లైఫ్ యాన్యుటీని జీవిత భాగస్వామితో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
ఎల్ఐసీ సరళ్ పెన్షన్ స్కీమ్ పాలసీని కొనుగోలు చేయడానికి కనీస వయస్సు 40 సంవత్సరాలుగా ఉన్నా గరిష్ట వయస్సు 80 సంవత్సరాలుగా నిర్ణయించారు. సరళ్ పెన్షన్ కింద పొందే యాన్యుటీని భవిష్యత్తులో నెలవారీ, త్రైమాసికం లేదా వార్షికంగా చెల్లించవచ్చు. ఎల్‌ఐసీ తన పాలసీ డాక్యుమెంట్‌లో పాలసీ ప్రారంభంలో యాన్యుటీ రేట్లు హామీ ఇస్తుంది. అలాగే పాలసీదారు జీవితకాలమంతా యాన్యుటీలు చెల్లిస్తుంది. ఉదాహరణకు 60 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టి వార్షిక యాన్యుటీ మోడ్‌ను ఎంచుకుంటే అతనికి రూ.58,950 లభిస్తుంది. ఎల్ఐసీ సరళ్ పెన్షన్ స్కీమ్‌ను ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్ లేదా స్థానిక ఎల్ఐసీ ఆఫీస్ నుంచి పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి