
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ను వ్యవసాయానికి, ఎగుమతులకు ప్రధాన కేంద్రంగా మార్చాలని యోచిస్తోంది. ముఖ్యంగా జేవార్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఆధారపడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా యమునా ఎక్స్‌ప్రెస్‌వే లేదా జేవార్ విమానాశ్రయం సమీపంలో ఒక అత్యాధునిక ఫుడ్ పార్క్‌ను నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ మెగా ప్రాజెక్టుకు ప్రముఖ సంస్థ పతంజలి ఫుల్ సపోర్ట్‌గా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ ఈ మేరకు ఒక కీలక ప్రతిపాదనను సిద్ధం చేసింది. అథారిటీ – పతంజలి – కర్ణాటకకు చెందిన ఇన్నోవా ఫుడ్ పార్క్ మధ్య భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. సెక్టార్ 24Aలో పతంజలికి గతంలో కేటాయించిన ఫుడ్ పార్క్ భూమిలోంచి 50 ఎకరాలను ఇన్నోవా ఫుడ్ పార్క్‌కు సబ్-లీజుకు ఇవ్వాలని అథారిటీ కోరింది. అథారిటీ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శైలేంద్ర భాటియా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రతిపాదనను పతంజలితో చర్చించారు, కానీ వారి నిర్ణయం ఇంకా ఖరారు కాలేదు. పతంజలి తన ప్రాజెక్ట్ నిబంధనల ప్రకారం తమకు కేటాయించిన భూమిలో 20శాతం వరకు సబ్-లీజుకు ఇచ్చే అవకాశం ఉంది. ఈ చర్య పతంజలి ప్రాజెక్టును కూడా ప్రోత్సహిస్తుందని అథారిటీ తెలిపింది.
ప్రపంచ బ్యాంకు-యూపీ వ్యవసాయ అభివృద్ధి ప్రాజెక్టులో భాగమైన ఈ ఫుడ్ పార్క్, జేవార్ విమానాశ్రయం సమీపంలో వ్యవసాయ-ఎగుమతి మౌలిక సదుపాయాలను పెంచడానికి ఉద్దేశించబడింది. ఈ ఫుడ్ పార్క్ ద్వారా వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తులను పరీక్షించడం, గ్రేడింగ్ చేయడం, ఎగుమతి కోసం ప్యాకేజింగ్ చేయడానికి అత్యాధునిక సౌకర్యాలు లభిస్తాయి. విమానాశ్రయం యొక్క కార్గో టెర్మినల్ నుండి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ కేంద్రం, మధ్యప్రాచ్యం, యూరప్, రష్యాతో సహా అంతర్జాతీయ మార్కెట్లకు వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా ఎగుమతి చేయడానికి వీలు కల్పిస్తుంది. దీనివల్ల రవాణా సమయం, ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి.
2017లోనే రాష్ట్ర ప్రభుత్వం సెక్టార్ 24లో పతంజలి గ్రూప్‌కు ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్‌ను అభివృద్ధి చేయడానికి 430 ఎకరాల భూమిని కేటాయించింది. పతంజలి ఈ 50 ఎకరాలను సబ్-లీజుకు ఇవ్వడానికి అంగీకరిస్తే, ఇన్నోవా వ్యవసాయ ఎగుమతి కేంద్రాన్ని త్వరగా స్థాపించడానికి వీలవుతుంది. తద్వారా పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ను వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతికి గ్లోబల్ హబ్‌గా మార్చే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. అయితే పతంజలి నుండి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి