
పతంజలి గ్రూప్ తన పెట్టుబడిదారులకు బంపర్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. పతంజలి ఫుడ్స్ బోనస్ షేర్లను వాటాదారులకు ఇస్తామని ప్రకటించింది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇవ్వాలని బోర్డు సిఫార్సు చేసింది. అంటే కంపెనీలో 1 షేర్ కొంటే రెండు షేర్లు ఫ్రీగా లభిస్తాయి. కంపెనీ త్వరలో రికార్డ్ తేదీని ప్రకటిస్తుంది. రికార్డు డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే పెయిడ్ అప్ ఈక్విటీ షేర్లు ఉంటాయో వారు బోనస్ షేర్లను పొందవచ్చు. రెండు నెలల్లో ఈ బోనస్ షేర్లను జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత వాటాదారులకు ప్రయోజనం చేకూర్చడానికి, మార్కెట్లో కంపెనీ వాటాల లిక్విడిటీని పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బోనస్ షేర్ల ప్రకటనతో కంపెనీ షేర్లు స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
ఈ ప్రక్రియలో భాగంగా కంపెనీ దాదాపు 72,50,12,628 కొత్త షేర్లను కంపెనీ జారీ చేస్తుంది. బోనస్ తర్వాత కంపెనీ మొత్తం షేర్ క్యాపిటల్ రూ.145 కోట్ల నుంచి రూ.217.50 కోట్లకు పెరుగుతుంది. పతంజలి ఫుడ్స్ యొక్క నికర లాభం మార్చి 2025 త్రైమాసికంలో 74శాతం పెరిగి.. 358.53 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ. 206.31 కోట్లుగా ఉంది. కంపెనీ నిర్వహణ ఆదాయం కూడా రూ.9,744.73 కోట్లకు పెరిగింది. గతేడాది ఇది రూ.8,348.02 కోట్లుగా ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం రూ. 1,301.34 కోట్లుగా ఉంది. గతేడాది 765.15 కోట్ల కంటే ఇది ఎక్కువ. ఇక మొత్తం దాయం రూ.34,289.40 కోట్లుగా ఉంది. గతేడాది ఇది రూ.31,961.62 కోట్లుగా ఉంది. కంపెనీ స్టాక్ గత ఏడాదిలో 19శాతం కంటే ఎక్కువ లాభపడగా.. ఇప్పుడు రూ.1,862.35 వద్ద ట్రేడవుతోంది. అయినప్పటికీ ఇది ఇప్పటికీ దాని 52 వారాల గరిష్ట స్థాయి స్థాయి కంటే దాదాపు 8శాతం తక్కువగా ఉంది.
బోనస్ షేర్లు అంటే కంపెనీ తన ప్రస్తుత వాటాదారులకు ఉచితంగా ఇచ్చే అదనపు షేర్లు. ఈ షేర్లు కంపెనీ నిల్వల నుండి ఇవ్వబడతాయి. ఇది కంపెనీ మొత్తం షేర్ల సంఖ్యను పెంచుతుంది. షేర్ ధర అదే నిష్పత్తిలో తగ్గుతుంది. కానీ కంపెనీ మొత్తం విలువ అలాగే ఉంటుంది. ఇది కంపెనీ మంచి ఆర్థిక స్థితిని సూచిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..