ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది. మన ఇండియన్ మార్కెట్లో కూడా వీటిని అధికంగా కొనుగోలు చేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వాలు కూడా పర్యావరణ హితమైన ఈ వాహనాలను ప్రోత్సహించేందుకు పలు రాయితీలు అందిస్తుంది. అయితే ఇటీవల ఫేమ్-2 కింద అందిస్తున్న సబ్సిడీని తగ్గించింది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కాస్త పెరిగాయి. అన్ని కంపెనీలకు చెందిన టూ వీలర్ల ధరలు కూడా పెరిగాయి. అయితే ఓలా ఎలక్ట్రిక్ మాత్రం అందుకు విరుద్ధంగా రేట్లను తగ్గించింది. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్ ప్రకటించింది. తన పోర్ట్ ఫోలియోలోని ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ స్కూటర్ ధరను దాదాపు రూ. 20,000 వరకూ తగ్గించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుతం ఈ ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ ధర రూ. 1,09,999(ఎక్స్ షోరూం)గా ఉంది. ఈ మోడల్ పై ఓలా ప్రత్యేక తగ్గింపు ధరను అందిస్తోంది. ఏకంగా రూ. 20,000 వరకూ తగ్గింపు ఈ స్కూటర్ ను అందిస్తోంది. దీనిని ఇప్పుడు కేవలం రూ. 89,999(ఎక్స్ షోరూం)నకు కొనుగోలు చేయొచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం డిసెంబర్ చివరి వరకూ మాత్రమే ఉంటుందని ఓలా కంపెనీ ప్రకటించింది. రానున్నకాలంలో అదనపు బెనిఫిట్స్ కూడా ఉంటాయని కంపెనీ పేర్కొంది. కొత్త ఏడాదిలో మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉంటుందని వివరించింది.
ఓలా ఎస్ 1 ఎక్స్ ప్లస్ స్కూటర్లో 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీంతో సింగిల్ చార్జ్ పై 151 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. 500వాట్ల చార్జర్ ను ఇది అందిస్తుంది. దీని సాయంతో 7.4 గంటల్లోనే పూర్తిగా బ్యాటరీని చార్జ్ చేయొచ్చు. ఇక మోటార్ విషయానికి వస్తే దీనిలో హబ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 90కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. కేవలం 3.3 సెకండ్లలోనే సున్నా నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 5.5 సెకండ్లలోనే సున్నా నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనలో ఎకో మోడ, నార్మల్ మోడ్, స్పోర్ట్ మోడ్ వంటివి ఉంటాయి.
ఈ కొత్త ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఐదు అంగుళాల ఎల్సీడీ డిస్ ప్లే ఉంటుంది. ఎల్ఈడీ లైటింగ్, సైడ్ స్టాండ్ అలర్ట్, రివర్స్ మోడ్, రిమోట్ బూత్ అన్ క్లాక్, నేవిగేషన్ వంటివి ఉంటాయి. బ్లూటూత్, జీపీఎస్ కనెక్టివీటీతో ఈ స్కూటర్ వస్తుంది.
ఈ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ నవంబర్ మాసంలో 30వేలకు పైగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడయ్యాయని అన్నారు. ఇది మన దేశీయ మార్కెట్లోనే ఓ రికార్డు అని ఆయన పేర్కొన్నారు. ఈ ఓలా ఎస్ 1 ఎక్స్ ప్లస్ ధరను ఇప్పుడు తగ్గించడంతో ఇతర సంప్రదాయ పెట్రోల్ ఇంజిన్ స్కూటర్లతో సరిసమానంగా సేల్స్ రాబడుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎందుకంటే ప్రజలు సంప్రదాయ ఇంజిన్ వాహనాల ధరలోనే ఇదీ ఉంటుంది కాబట్టి ప్రజలు ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఎంచుకొనే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..