
పిల్లలు పుట్టినప్పటి నుండి వారి చదువు, పెళ్లి, సెటిల్మెంట్ గురించి తల్లిదండ్రులు ఆలోచిస్తూనే ఉంటారు. అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా, భవిష్యత్తులో ఉన్నత చదువుల ఖర్చు ఊహించని స్థాయికి చేరుకోనుంది. ఇలాంటి తరుణంలో చక్రవడ్డీ శక్తిని ఉపయోగించుకుని, చిన్న మొత్తాలను భారీ సంపదగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్‌పిఎస్ వాత్సల్య పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇది కేవలం ఒక సేవింగ్స్ అకౌంట్ మాత్రమే కాదు, ఇది ఒక దీర్ఘకాలిక సంపద సృష్టి సాధనం. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడిచే ఈ పథకం, మైనర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. భారత పౌరుడైన ఏ బిడ్డ పేరు మీదనైనా వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ ఖాతాను తెరవవచ్చు.
మీరు చేసే చిన్న పెట్టుబడి మీ బిడ్డకు 18 ఏళ్లు వచ్చేసరికి ఎంత పెద్ద మొత్తంగా మారుతుందో చూద్దాం
నెలవారీ రూ. 5,000 పెట్టుబడి: మీ బిడ్డ పుట్టిన నెల నుండే ప్రతి నెలా రూ.5,000 డిపాజిట్ చేస్తే, 18 ఏళ్లు నిండేసరికి రూ.34.22 లక్షల భారీ నిధి సమకూరుతుంది.
నెలవారీ రూ. 8,000 పెట్టుబడి: ఒకవేళ మీరు నెలకు రూ. 8,000 పొదుపు చేయగలిగితే, మీ బిడ్డ యుక్తవయసులోకి వచ్చేసరికి ఆ మొత్తం రూ. 54.75 లక్షలకు చేరుకుంటుంది.
నెలవారీ రూ. 10,000 పెట్టుబడి: మొదటి నెల నుండే రూ.10,000 పెట్టుబడి పెడితే, 18 ఏళ్ల వయసులో ఆ బిడ్డ చేతిలో రూ. 68.44 లక్షల సంపద ఉంటుంది.
ఈ మొత్తం మీ బిడ్డ విదేశీ చదువులకు, స్టార్టప్ ప్రారంభించడానికి లేదా వివాహ ఖర్చులకు కొండంత అండగా నిలుస్తుంది.
చాలా పథకాలు పిల్లలకు మేజర్ వయసు రాగానే ముగిసిపోతాయి. కానీ, NPS వాత్సల్య అక్కడితో ఆగదు. బిడ్డకు 18 ఏళ్లు నిండగానే ఈ ఖాతా దానంతట అదే సాధారణ NPS అకౌంట్‌గా మారిపోతుంది. ఒకవేళ ఆ యువతీయువకులు తమ కెరీర్ ప్రారంభంలో కూడా ఈ పెట్టుబడిని కొనసాగిస్తే, 60 ఏళ్ల వయసు వచ్చేసరికి చక్రవడ్డీ ప్రభావంతో వారు కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది. అంటే చిన్నప్పుడు మీరు వేసిన పునాది, వారి వృద్ధాప్యం వరకు ఆర్థిక భరోసానిస్తుంది.