UPI Payments: ఇకపై పిన్ లేకుండానే యూపీఐ పేమెంట్స్! ఈ ఫీచర్ ఎలా ఉంటుందంటే..

సాధారణంగా ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీయం లాంటి యూపీఐ యాప్స్ లో పేమెంట్ చేయాలంటే కచ్చితంగా పిన్ ఎంటర్ చేయాల్సిందే. అయితే ఇక నుంచి పిన్ అవసరం లేకుండానే మరింత సింపుల్ గా పేమెంట్స్ చేసే ఆప్షన్ రాబోతోంది. మరి ఆ ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందామా?

UPI Payments: ఇకపై పిన్ లేకుండానే యూపీఐ పేమెంట్స్! ఈ ఫీచర్ ఎలా ఉంటుందంటే..
Upi Payments2

Updated on: Oct 08, 2025 | 11:12 AM

డిజిటల్ పేమెంట్స్ విషయంలో ఓ కొత్త మార్పు రాబోతోంది. ఇప్పటివరకు యూపీఐ ట్రాన్సాక్షన్ చేయాలంటే పిన్ ఎంటర్ చేయడం తప్పనిసరి. అయితే ఇకనుంచి పిన్ తో పని లేకుండా ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ స్కాన్ తోనే పేమెంట్ చేసేలా ఓ కొత్త అప్ డేట్ రాబోతోంది. ఈ ఫీచర్ ద్వారా యూపీఐ చెల్లింపులు మరింత సులభం అవ్వనున్నాయి. దీనికై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేయనుంది. ఈ ఫీచర్ ను త్వరలోనే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించే అవకాశం ఉంది.

ఆధార్ డేటాతో..

ముంబైలో జరుగుతున్న గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ కొత్త ఫీచర్ ను ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఫింగర్ ప్రింట్, ఫేస్ స్కాన్ కు సంబంధించిన డేటా ఇప్పటికే ఆధార్ వద్ద ఉంది. ఇకపై పేమెంట్స్ కు కూడా ఈ సిస్టమ్ ను జత చేయడంతో ట్రాన్సాక్షన్లు మరింత ట్రాన్సపరెంట్ గా ఉండే అవకాశం ఉంది.

ఈజీ పేమెంట్స్

ఈ కొత్త ఫీచర్ ద్వారా జస్ట్ ఫోన్ అన్ లాక్ చేసినంత సింపుల్ గా పేమెంట్ చేయొచ్చు. పిన్ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే రాంగ్ పిన్ ఎంటర్ చేసే అవకాశమూ లేదు. డిజిటల్‌ పేమెంట్స్ అలవాటు లేని వారికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. యూపీఐ వాడకాన్ని మరింత పెంచడం కోసమే ఈ ఫీచర్ తీసుకొస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు.

మరింత సేఫ్టీ

ఇకపోతే యూపీఐ సిస్టమ్‌లో షోల్డర్ సర్ఫింగ్, డివైజ్ స్కిమ్మింగ్ వంటి కొన్ని మోసాలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. అలాగే యూపీఐ పిన్ ను యాక్సెస్ చేయడం ద్వారా సదరు వక్తి బ్యాంక్ అకౌంట్ ను కూడా హ్యాక్  చేయగలుగుతున్నారు. కానీ, బయోమెట్రిక్ వాడితే అలాంటి ప్రమాదాలు ఉండవు. అందుకే ఇది చాలా సెక్యూర్డ్ సిస్టమ్ అని నిపుణులు చెప్తున్నారు. ఈ ఫీచర్ అక్టోబర్ 8 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..