ఈ కాలంలో ఏ చిన్న అవసరానికైనా చేతిలో మొబైల్ ఫోన్, అందులో ఏదైనా యూపీఐ (UPI) యాప్ ఉంటే సరిపోతుంది.. చివరకు చెప్పులు కుట్టి జీవనం సాగించే అతి సామాన్యులు సైతం QR కోడ్ పెట్టుకుని యూపీఐ ద్వారా తామందించిన సేవలకు డబ్బులు తీసుకుంటున్నారు. నగదు రహిత లావాదేవీలను సులభతరం చేసి సామాన్యుల ముంగిటకు తీసుకొచ్చి విప్లవం సృష్టించిన యూపీఐ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చాలా మంది తమ ఫోన్లలో యూపీఐ ద్వారా సేవలందించే పలు యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారు. కొందరు ఫోన్‌పే (PhonePe), మరికొందరు పేటీఎం (Paytm) లేదంటే గూగుల్ పే (Google Pay) ఇలా తమకు నచ్చిన యాప్ ద్వారా సేవలు పొందుతున్నారు.. అందిస్తున్నారు. కొందరైతే రెండు మూడు యాప్‌లను కూడా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కొక్కరు అనేక యూపీఐ ఐడీలను కలిగి ఉన్నారు. వాటిలో కొన్నింటిని తరచుగా వినియోగిస్తున్నప్పటికీ.. మరికొన్నింటిని నెలల తరబడి వినియోగించకుండా వదిలేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో యూపీఐ ఐడీ వినియోగంపై ‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (NPCI) తాజాగా కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. డిసెంబర్ 31 నుంచి పలు యూపీఐ ఐడీలను డీయాక్టివేట్ చేయాల్సిందిగా ఈ సంస్థ గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
అంటే 2023 డిసెంబర్ 31 నాటికి ఏ వ్యక్తులైనా తమ యూపీఐ ఐడీ ద్వారా ఏడాది కాలంగా ఎలాంటి లావాదేవీలు నిర్వహించకపోతే.. అలాంటి ఐడీలను సంబంధిత సంస్థలు డీయాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. టెలీకాం సంస్థలకు ‘టెలీకాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా’ (TRAI), బ్యాంకింగ్ సంస్థలకు ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (RBI) వంటి రెగ్యులేటరీ సంస్థల మాదిరిగానే యూపీఐ సేవలు అందించే సంస్థలకు NPCI వ్యవహరిస్తుంది. ఈ సంస్థ ఇచ్చే మార్గదర్శకాల ప్రకారమే సంబంధిత యూపీఐ సేవలందించే సంస్థలు పనిచేయాల్సి ఉంటుంది.
ఏడాదికి పైగా వినియోగంలో లేని యూపీఐ ఐడీలను డీయాక్టివేట్ చేయాలన్న నిర్ణయం వెనుక ప్రధాన కారణం సైబర్ నేరాలను నియంత్రించడమేనని NPCI వెల్లడించింది. యూపీఐ ఐడీల ద్వారా ఆన్‌లైన్ మోసాలు, మోసపూరిత ఆర్థిక లావాదేవీలు, కుంభకోణాలు జరుగుతున్నాయని గుర్తించి, వాటికి అడ్డుకట్ట వేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. యూపీఐ లావాదేవీలు బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసిన మొబైల్ నెంబర్ ఆధారంగా జరుగుతున్నాయన్న విషయం తెలిసిందే. అయితే చాలా సందర్భాల్లో వినియోగదారులు తాము గతంలో సృష్టించిన యూపీఐ ఐడీలను క్లోజ్ లేదా డీయాక్టివేట్ చేయకుండా కొత్త ఐడీలు సృష్టిస్తున్నారని ఎన్పీసీఐ గుర్తించింది. మొబైల్ నెంబర్ మార్చినప్పుడు పాత మొబైల్ నెంబర్‌ను బ్యాంక్ ఖాతాలు – యూపీఐ ఐడీలతో డీలింక్ చేయడం లేదని.. అలాంటి సందర్భంలో ఆ మొబైల్ నెంబర్ మరొకరికి అలాట్ చేసినప్పుడు గతంలో సృష్టించిన యూపీఐ ఐడీల ద్వారా బ్యాంకు ఖాతాలను యాక్సెస్ చేసేందుకు ఆస్కారం కల్గుతోంది. వినియోగంలో లేని యూపీఐ ఐడీలను డీయాక్టివేట్ చేయడం ద్వారా ఈ తరహా నేరాలకు బ్రేక్ వేయవచ్చని భావిస్తోంది.
ఎన్పీసీఐ జారీ చేసిన తాజా మార్గదర్శకాలు కేవలం యూపీఐ సేవలు అందించే థర్డ్ పార్టీ యాప్‌లకే పరిమితం కాలేదు.. బ్యాంకింగ్ సేవలతో పాటు యూపీఐ సేవలు అందిస్తున్న వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు కూడా వర్తిస్తాయి. మొత్తంగా యూపీఐ విధానాన్ని ఉపయోగించి సేవలు అందించే అన్ని రకాల యాప్‌లకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. తద్వారా డీయాక్టివేట్ అయిన యూపీఐ ఐడీల ద్వారా సంబంధిత బ్యాంకు ఖాతాలకు నిధులు పంపడం కూడా సాధ్యపడదు. అంటే ఇన్‌వార్డ్ లావాదేవీలు సైతం కుదరవు. అలాగే యూపీఐ ఐడీకి లింక్ అయిన మొబైల్ నెంబర్ సైతం డిస్‌కనెక్ట్ / డీలింక్ అవుతుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఇంక ఆలస్యం చేయకుండా మీ పాత మొబైల్ నెంబర్‌కు లింక్ అయిన బ్యాంక్ ఖాతాల్లో కొత్త మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయించుకోవడంతో పాటు.. పాత యూపీఐ ఐడీలను తక్షణమే డీయాక్టివేట్ చేయడం అన్ని విధాలా శ్రేయస్కరం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..