
దేశంలో పెట్రోల్ బంక్‌ల వద్ద క్యూలైన్లు, నో స్టాక్ బోర్డులు ప్రదర్శిస్తున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇంధన నిల్వలు, గ్యాస్ సరఫరాలపై పెట్రోలియం శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. దేశంలో తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని, రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని తెలిపింది. 26 కోట్ల టన్నుల చమురు అందుబాటులో ఉందని, పెట్రోల్, డీజిల్ కొరత లేదని స్పష్టం చేసింది. అటు ఎల్పీజీ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేవని, వాణిజ్య గ్యాస్ కేటాయింపు 50 శాతం పెంచినట్లు వెల్లడించింది. గ్యాస్ ఆన్‌లైన్ బుకింగ్స్ 92 శాతానికిపైగా జరుగుతున్నాయని, దుష్ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని పెట్రోలియం శాఖ సూచించింది.
దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడనుందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. పెట్రోల్ బంక్‌ల వద్దకు క్యూ కడుతున్నారు. ముందుగానే ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు. అలగే డబ్బాలు, బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల పెట్రోల్ బంక్‌ల వద్ద వాహనదారులు క్యూ కడుతుండటంతో స్టాక్ అయిపోతుంది. దీంతో నో స్టాక్ బోర్డులతో పెట్రోల్ బంక్‌లు మూతపడ్డ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో త్వరలో పెట్రోల్ కొరత ఏర్పడనుందనే ప్యానిక్ ప్రజల్లో నెలకొంది. సరిపడ నిల్వలు ఉన్నాయని, అలాంటి కొరత ఏం లేదని కేంద్రం క్లారిటీ ఇస్తున్నా.. ప్రజల్లో మాత్రం ఆందోళన నెలకొంది.
త్వరలో ధరలు పెరుగుతాయా..?
గ్యాస్ తరహాలోనే త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పవర్ పెట్రోల్ ధర లీటర్‌పై రూ.2 పెరగ్గా.. ఇటీవల వాణిజ్య డీజిల్ ధరలను కూడా పెంచారు. త్వరలో సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయనే వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు కొరత ఏర్పడుందనే వార్తలతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ముందుగానే పెట్రోల్ బంక్‌ల వద్దకు వెళ్లి ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు.