
వాహనదారులకు ఎప్పుడూ ఉండే పెద్ద డౌట్.. టైర్లలో సాధారణ గాలి కొట్టించాలా లేక నైట్రోజన్ గాలి కొట్టించాలా అని. సాధారణంగా పెట్రోల్ బంకుల్లో లేదా టైర్ షాపుల్లో నైట్రోజన్ గాలి వాడితే టైర్లు ఎక్కువ కాలం మన్నుతాయని, మైలేజ్ కూడా పెరుగుతుందని చెబుతుంటారు. అయితే ఇందులో నిజమెంత, సాధారణ గాలికి, నైట్రోజన్‌కు ఉన్న ప్రధాన తేడాలు ఏమిటి..? అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. సాధారణ గాలితో పోలిస్తే నైట్రోజన్ వాయువు అణువులు పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి. దీనివల్ల టైర్ రబ్బర్ సూక్ష్మ రంధ్రాల గుండా నైట్రోజన్ బయటకు లీక్ అవ్వడం చాలా నెమ్మదిగా జరుగుతుంది. సాధారణ గాలి నింపినప్పుడు ప్రతి వారం లేదా పది రోజులకు ఒకసారి ప్రెజర్ చెక్ చేసుకోవాల్సి వస్తే నైట్రోజన్ నింపినప్పుడు దాదాపు ఒక నెల రోజుల వరకు గాలి పడిపోకుండా స్థిరంగా ఉంటుంది.
హైవేలపై లాంగ్ డ్రైవ్స్ చేసేటప్పుడు లేదా వేసవి కాలంలో వాహనం నడుపుతున్నప్పుడు నైట్రోజన్ గాలి ఎంతో సురక్షితంగా పనిచేస్తుంది. సాధారణ గాలిలో తేమ, ఆక్సిజన్ ఉంటాయి. ఇవి టైర్ రోడ్డుపై వేడెక్కినప్పుడు ప్రెజర్‌ను ఒక్కసారిగా పెంచి టైర్ పేలిపోయే ప్రమాదాన్ని కలిగిస్తాయి. కానీ నైట్రోజన్ అనేది పూర్తిగా పొడి వాయువు కావడం వల్ల టైర్‌ను ఎప్పుడూ చల్లగా ఉంచుతుంది. హఠాత్తుగా ప్రెజర్ పెరగకుండా చూస్తుంది. దీనికితోడు నైట్రోజన్ గాలి వాడకం వల్ల టైర్లు, మెటల్ రిమ్‌ల ఆయుష్షు పెరుగుతుంది. సాధారణ గాలిలోని ఆక్సిజన్, తేమ సమక్షంలో టైర్ లోపలి భాగం, వీల్ రిమ్‌లు త్వరగా తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. నైట్రోజన్‌లో తేమ ఉండదు కాబట్టి ఈ సమస్య రాదు. అంతేకాకుండా టైర్‌లో గాలి ప్రెజర్ ఎప్పుడూ సమానంగా ఉండటం వల్ల రోడ్డుపై వాహనం సులభంగా ముందుకు సాగి మైలేజ్ కూడా స్వల్పంగా పెరుగుతుంది.
అదేవిధంగా లభ్యత, ఖర్చు విషయానికి వస్తే సాధారణ గాలికే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది. సాధారణ గాలి ప్రతి చిన్న షాపులోనూ, పెట్రోల్ బంకుల్లోనూ ఉచితంగా లేదా చాలా తక్కువ ధరకు లభిస్తుంది. కానీ నైట్రోజన్ గాలి కొన్ని నిర్దిష్టమైన బంకులు లేదా టైర్ షోరూమ్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనికి కొంత పైసలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ నైట్రోజన్ ఉన్న టైర్‌లో అత్యవసర సమయంలో సాధారణ గాలి కలిపినా ఎలాంటి ప్రమాదం ఉండదు. కాకపోతే నైట్రోజన్ పూర్తి ప్రభావం తగ్గుతుంది.
మీరు ప్రతిరోజూ నగర పరిధిలోనే తక్కువ దూరాలు ప్రయాణించే వారైతే పెట్రోల్ బంకుల్లో లభించే సాధారణ గాలి సరిపోతుంది. కానీ మీరు తరచుగా హైవేలపై సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారైనా, లేదా ఎండలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వాహనం నడిపేవారైనా మీ వాహన భద్రత కోసం నైట్రోజన్ గాలినే ఎంచుకోవడం మంచి నిర్ణయం.