
కేంద్ర బడ్జెట్ 2026-27 సమర్పించిన తర్వాత కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 30 మంది విద్యార్థులతో మాట్లాడనున్నారు. అలాగే విద్యార్థులు బడ్జెట్ ప్రసంగాన్ని లోక్‌సభ గ్యాలరీ నుండి లైవ్‌లో చూడనున్నారు. భారతదేశం అంతటా వివిధ రాష్ట్రాల నుండి వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, వైద్య విద్య, వృత్తి విద్యా కోర్సులు వంటి వివిధ విద్యా విభాగాల నుండి విద్యార్థులు వస్తారు.
విద్యార్థులు కర్తవ్య భవన్-1లో ఉన్న ఆర్థిక మంత్రిత్వ శాఖను కూడా సందర్శించి, మంత్రిత్వ శాఖ పనితీరు, విధాన రూపకల్పన ప్రక్రియలు, దేశ నిర్మాణంలో సంస్థల పాత్ర గురించి అవగాహన పొందడానికి వివిధ సీనియర్ అధికారులతో సంభాషిస్తారు. సాయంత్రం తరువాత సీతారామన్ విద్యార్థులతో సంభాషించి, బడ్జెట్ ముఖ్య ప్రాధాన్యతలు, భారతదేశ భవిష్యత్తు కోసం దాని దార్శనికత, యువతపై దాని ప్రభావంపై స్వేచ్ఛగా చర్చిస్తారు. విద్యార్థులు తమ ఆలోచనలు, దృక్పథాలు, ఆకాంక్షలను కూడా పంచుకుంటారు. సంభాషణ సమయంలో యువత దేశం గురించి వారి అభిప్రాయాలను అందిస్తారు.
విద్యార్థులలో ఆర్థికం, ఆర్థిక శాస్త్రం, పాలన, ప్రజాస్వామ్య ప్రక్రియల గురించి ఎక్కువ అవగాహనను పెంపొందించడానికి, భారతదేశ ఆర్థిక, పార్లమెంటరీ విధానాలలో యువత సమాచారం, నిర్మాణాత్మక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. బడ్జెట్ తయారీ సమయంలో, యువతతో సహా పౌరుల నుండి వివిధ వేదికల ద్వారా వివిధ ఇన్‌పుట్‌లు కోరింది ప్రభుత్వం. ఇవి రాబోయే కేంద్ర బడ్జెట్ 2026-27లో ప్రతిబింబిస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి