New tax regime 2023: కొత్త పన్ను విధానంతో 25 శాతం వరకూ సొమ్ము ఆదా! అదేలాగో మీరే చూడండి..
కొత్త పన్ను విధానంపై చాలా మంది సరైన అవగాహన లేకపోవడంతో అంతా గందరగోళంగా ఫీలవుతున్నారు. అసలు ఎవరు పన్ను చెల్లించాలి? ఎంత చెల్లించాలి? కొత్త పన్ను విధానం ద్వారా లాభం ఏమిటీ? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
నిర్మలమ్మ పద్దులు ఉద్యోగులకు ఊరటనిచ్చాయి. లక్షలాది మధ్య తరగతి ఉద్యోగుల కళ్లల్లో ఈ సారి కేంద్ర బడ్జెట్ కాంతులు విరజిమ్మింది. పన్ను శ్లాబుల్లో పెద్ద ఎత్తున మార్పులు చేయడం ద్వారా ఉద్యోగులకు మేలు చేసింది. అయితే కొత్త పన్ను విధానంపై చాలా మంది సరైన అవగాహన లేకపోవడంతో అంతా గందరగోళంగా ఫీలవుతున్నారు. అసలు ఎవరు పన్ను చెల్లించాలి? ఎంత చెల్లించాలి? కొత్త పన్ను విధానం ద్వారా లాభం ఏమిటీ? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ ప్రకటించిన కొత్త పన్ను విధానంపై సమగ్ర విశ్లేషణ మీ కోసం..
కేంద్ర మంత్రి ప్రకటన ఇది..
పన్ను శ్లాబుల మార్పుపై కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కీలక ప్రకటన చేసింది. వార్షిక ఆదాయం రూ.7లక్షలు వరకు ఉంటే ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే, శ్లాబుల్లో మాత్రం రూ.3లక్షల వరకు సున్నా శాతం పన్ను అని పేర్కొంది. గతంలో రూ.2.50లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారికి పన్ను పరిధి నుంచి మినహాయింపు ఉండేది. ఇప్పుడు అది రూ.3లక్షలకు పెరిగింది. అంటే ఏడాదికి మూడు లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
మిగిలిన శ్లాబుల వివరాలు ఇవి..
కొత్త పన్ను విధానం ప్రకారం రూ.3 లక్షల నుంచి రూ.6లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు 5శాతం పన్ను పరిధిలోకి వస్తారు. రూ.6లక్షలు- రూ.9లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం రిబేట్ ఇస్తుంటుంది. ఇదివరకు రూ.5లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి రిబేట్ ఉండగా.. ప్రస్తుతం ఆ పరిమితిని రూ.7లక్షల వరకు పెంచింది. అంటే.. రూ.7లక్షల వరకు ఆదాయం ఉన్నవారు పన్ను మినహాయింపులు ఉపయోగించుకోవచ్చు. తద్వారా ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
ఈ ఉదాహరణ చూడండి..
ఏడాదికి రూ.7లక్షల వరకు సంపాదించేవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.9లక్షల వార్షిక వేతనం పొందుతున్న వ్యక్తులు ప్రస్తుతం సుమారు రూ.60వేలు పన్ను చెల్లిస్తున్నారు. ఇకపై వీరు చెల్లించాల్సిన పన్ను రూ.45వేలు మాత్రమే. ఫలితంగా రూ.15వేల మేర ప్రయోజనం కలగనుంది.
అది ఎలా అంటే.. ఇప్పుడు, మీ జీతం సంవత్సరానికి రూ 9 లక్షలు అనుకుందాం. శ్లాబ్ లుగా విభజిస్తే.. మొదటి శ్లాబ్ 0-రూ. 3 లక్షలు.. దీనికి పన్ను లేదు (గతంలో ఇది 0-రూ. 2.5 లక్షలు), మిగిలిన జీతం రూ. 6 లక్షలు రెండు స్లాబ్‌ల కింద పన్ను విధించబడుతుంది. అంటే రూ. 3-6 లక్షల భాగానికి 5 శాతం.. అంటే రూ. 15,000, అలాగే రూ. 6-9 లక్షల కు 10 శాతం పన్ను అంటే రూ. 30,000 పడుతుంది. దీని ప్రకారం మొత్తం రూ. 9 లక్షల వార్షిక జీతానికి రూ. 45,000 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే పాత శ్లాబ్ లలో అయితే ఈ మొత్తం రూ. 60,000 అవుతుంది. అంటే దాదాపు 25 శాతం మీ సొమ్ము ఆదా అవుతుంది.
అదే విధంగా రూ.15 లక్షల వార్షిక వేతనం పొందే వ్యక్తులు ఇదివరకు రూ.1.87 లక్షలు చెల్లిస్తుండగా.. ఇప్పుడు అది రూ.1.5 లక్షలకు తగ్గనుంది. వీరు రూ.37వేలు పన్ను ఆదా చేసుకోవచ్చు. కొత్త పన్ను విధానం కింద ప్రతి పన్ను చెల్లింపుదారుడు రూ.50వేల స్టాండర్డ్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. దీని వల్ల రూ.15.5లక్షలు, ఆపైన ఆదాయం ఉన్న వేతన ఉద్యోగులు రూ.52,500 మేర పన్ను ప్రయోజనం పొందే అవకాశం ఉంది. అయితే, పన్ను చెల్లింపుదారులు ఇన్వెస్ట్మెంట్లపై ఎలాంటి డిడక్షన్లు, మినహాయింపులు పొందలేరని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..