ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఇటీవల ఓ కొత్త తరహా ఆన్ లైన్ మోసాన్ని బయట పెట్టింది. ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని తన ఖాతాదారులను, ప్రజలను హెచ్చరించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) లేదా ఆదాయపు పన్ను అధికారులుగా నటిస్తూ కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. చట్టపరమైన నిబంధనల పేరుతో ప్రజలను బెదిరించి, భారీ జరిమానాల రూపంలో డబ్బును కాజేస్తున్నారు. ఉన్నత ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు, సంపన్న వర్గాల చెందిన వారినే నేరగాళ్లు టార్గెట్ చేయడం విశేషం.
సైబర్ నేరగాడు ముందుగా తాను ఎంచుకుని వ్యక్తికి ఫోన్ చేస్తాడు. మెసెంజర్ యాప్ లోని వీడియో కాలింగ్ ఫీచర్ ను దీన్ని ఉపయోగిస్తాడు. తాను సీబీఐ లేదా ఆదాయపు పన్ను శాఖ అధికారినని పరిచయం చేసుకుంటాడు. సదరు వ్యక్తికి సంబంధించిన సమాచారం నేరగాడి దగ్గర ఉంటుంది. వాటి వివరాలను ప్రస్తావించి మాట్లాడడం మొదలుపెడతాడు. అలాగే ఇటీవల విక్రయించిన ఆస్తి, చెల్లించిన పన్ను వివరాలను ప్రస్తావిస్తాడు. దీంతో ఫోన్ లో మాట్లాడే వ్యక్తిపై నమ్మకం కలుగుతుంది. ఆస్తి వెబ్ సైట్లు, ప్రాపర్టీ బ్రోకర్ల వెబ్ సైట్, రిజిస్ట్రర్ కార్యాలయంలోని డేటాను తస్కరించి తన దగ్గర ఉంచుకుంటాడు. ఆస్తి విక్రయ సమయంలో పన్నును ఎగ్గొట్టారనో, ఆదాయపు పన్నును చెల్లించకుండా మోసం చేశారనో వివరించి, దాన్ని వల్ల అరెస్టు చేసే అవకాశం ఉందని భయపెడతాడు. ఆ నేరానికి జైలు శిక్ష విధిస్తారని, భారీగా జరిమానా కట్టాల్సి ఉందని చెబుతాడు.
జైలు గురించి వినగానే సాధారణంగా భయం కలుగుతుంది. దీంతో అవతలి వారు ఆందోళనకు గురవుతారు. దీన్నే నేరగాడు ఆసరాాగా చేసుకుంటాడు. ఈ కేసు నుంచి తప్పించుకోవాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. లేకపోతే అరెస్టు చేయాల్సి ఉంటుందని, పరువు పోతుందని హెచ్చరిస్తారు. కొన్ని బ్యాంకు ఖాతాలకు డబ్బులు పంపించాలని డిమాండ్ చేస్తారు. కొన్ని సందర్బాల్లో లంచం అడగరు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొంత డబ్బును వివిధ ఖాతాలకు పంపాలని కోరతాడు. కేసు విచారణ తర్వాత ఆ డబ్బులను తిరిగి వెనక్కి వచ్చేస్తాయని నమ్మిస్తాడు. ఇలాంటి స్కాములను ఫిషింగ్ లేదా సోషల్ ఇంజినీరింగ్ అని పిలుస్తారు. ఇవి మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారిక సంస్థలు ఫోన్ ద్వారా వ్యక్తిగత సమాచారం అడగవు. అలాగే చట్టం పేరుతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే భయపడకూడదు. ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే మీ బ్యాంకు అధికారులకు, పోలీసులకు సమాచారం అందించాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..