Mahila samman scheme: ఆ పొదుపు పథకానికి జై కొట్టిన మహిళలు.. దేశంలో ఎన్ని ఖాతాలను ప్రారంభించారంటే..?
ప్రజల సంక్షేమం, జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం కోసం ప్రభుత్వాలు వివిధ పొదుపు పథకాలను అమలు చేస్తాయి. వాటిలో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆయా కుటుంబాలు ఆర్థిక అభ్యున్నతి సాధిస్తాయి. ముఖ్యంగా పొదుపు అనే ప్రతి ఒక్కరికీ అత్యంత అవసరం. దాని మీదుగానే వారి జీవన పరిస్థితి ఆధారపడి ఉంటుంది.
మహిళల కోసం కేంద్రప్రభుత్వం ప్రకటించిన కొత్త పథకానికి విపరీతమైన ఆధరణ లభిస్తోంది. దేశ వ్యాప్తంగా సుమారు 4.33 మిలియన్ల మంది దీనిలో చేరారు. 2023 ఏప్రిల్ నెలలో మహిళా సమ్మాన్ పథకం పేరుతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీన్ని ప్రారంభించారు. మహిళా సమ్మాన్ పథకానికి మంచి ఆదరణ లభించిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇటీవల లోక్ సభలో వెల్లడించారు. అన్ని రాష్ట్రాల ప్రజలు దీనిలో చేరుతున్నారని తెలిపారు. మహారాష్ట్ర 7,46,223 ఖాతాలతో అగ్రస్థానంలో ఉందన్నారు. ఆ తర్వాత స్థానాల్లో తమిళనాడు (2,69,532), ఒడిశా (4,16,989), కర్ణాటక (2,93,007), ఉత్తర ప్రదేశ్ (2,69,532) కొనసాగుతున్నట్టు వెల్లడించారు. వీటి వెనుక పశ్చిమ బెంగాల్ (2,54,777), రాజస్థాన్ (2,22,169), ఆంధ్రప్రదేశ్ (2,11,016), గుజరాత్ (1,55,267), హిమాచల్ ప్రదేశ్ (1,43,704), మధ్యప్రదేశ్ (1,39,506) ఉన్నాయన్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గతేడాది ఏప్రిల్ లో ఈ పథకాన్ని ప్రారంభించారు. దీని పూర్తి పేరు మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం. దీని ద్వారా అధిక వడ్డీ రేటు అందజేస్తారు. ఈ పథకంలో గరిష్టంగా రూ.2 లక్షల వరకూ డిపాజిట్ చేసుకోవచ్చు. ఇది సింగల్ టైమ్ ఇన్వెస్ట్ మెంట్ స్కీమ్. అంటే డబ్బులను ఒకేసారి డిపాజిట్ చేసేయాలి. ఈ పథకం కాలపరిమితి రెండేళ్లు ఉంటుంది. మెచ్యురిటీ తర్వాత మీ పెట్టుబడికి వడ్డీని కలిపి అందజేస్తారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ లెక్కగడతారు. మహిళా సమ్మాన్ పథకం 2025 మార్చి వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనిలో డిపాజిట్లకు ప్రస్తుతం 7.50 వడ్డీ అందజేస్తున్నారు. మహిళలు తమ పేరుమీద, లేకపోతే తన మైనర్ బాలిక పేరు మీద ఖాతా తీసుకోవచ్చు.
ఈ పథకంలో కనీసం వెయ్యి రూపాయలను ఇన్వెస్ట్ చేసుకోవచు. ఉదాహరణకు మహిళా సమ్మాన్ పథకంలో రూ.రెండు లక్షలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ తర్వాత రూ.2.32 లక్షలు చేతికి వస్తాయి. రెండేళ్లలో 32 వేల రూపాయల వడ్డీ అందుతుంది. మధ్యలో ఖాతాను మూసివేయడానికి వీలుండదు. అయితే అత్యవసర సమయంలో మాత్రం మినహాయింపు ఇస్తారు. ఈ పథకంలో చేరడానికి వయో పరిమితి లేదు. దేశంలోని మహిళలందరూ అర్హులే. ఒకరు ఎన్ని ఖాతాలైనా ప్రారంభించవచ్చు. వీటికి పరిమితి లేదు. అయితే మూడు నెలలకు ఒక్కసారి మాత్రమే తీసుకునే అవకాశం ఉంటుంది. మహిళలకు ఆర్థికంగా మద్దతు ఇచ్చేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. ఎలాంటి రిస్క్ లేకుండా ఆదాయాన్ని కోరుకునేవారికి చాలా ఉపయోగంగా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి