SBI Pension Seva Portal: ప్రస్తుతం బ్యాంకులు తన వినియోగదారులకు ఎన్నో శుభవార్తలు అందిస్తున్నాయి. హోమ్ లోన్స్, వ్యక్తిగత లోన్స్, ఇంకా ఇతర లోన్స్‌లపై వడ్డీ రేట్లు తగ్గించడమే కాకుండా సీనియర్ సిటిజన్స్‌కు కూడా మంచి అవకాశాలు ఇస్తున్నాయి. ఇక పింఛన్‌దారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గుడ్‌న్యూస్ చెప్పింది. పెన్షనర్లు ఇకపై ఏదైనా ఎస్‌బీఐ బ్రాంచ్ వద్ద లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించే వీలు కల్పించింది. పెన్షనర్లకు ఉద్దేశించిన పెన్షన్ సేవా పోర్టల్ పునరుద్ధరణలో భాగంగా ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింది. పెన్షన్‌కు సంబంధించిన వివరాలను సులువుగా పొందే అవకాశాన్ని కల్పించినట్లు ఎస్‌బీఐ పేర్కొంది.
పెన్షనర్లు ఎస్‌బీఐ పెన్షన్ సేవా పోర్టల్ ద్వారా వారి పెన్షన్ స్లిప్/ ఫారం-16ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే సీనియర్ సిటిజన్స్ వారి పెన్షన్ లావాదేవీల వివరాలను చూడవచ్చు. ఎరియర్స్ బ్యాలన్స్ షీట్ డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించింది ఎస్‌బీఐ. అంతేకాకుండా తమ లైఫ్ సర్టిఫికెట్ స్థితిని తెలుసుకునే సదుపాయం కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. పెన్షనర్లు తమ పెన్షన్ ప్రొఫైల్ వివరాలను కూడా సులభంగా చూడవచ్చు.
పెన్షన్ చెల్లింపు వివరాలతో పెన్షనర్ల మొబైల్ ఫోన్లకు ఎస్‌బీఐ మెసేజ్‌లను పంపుతుంది. మీరు మీ పెన్షన్ స్లిప్పును ఈ-మెయిల్/ పెన్షన్ చెల్లింపు శాఖ ద్వారా పొందవచ్చు. జీవన్ ప్రమాణ్ సౌకర్యం బ్యాంకు శాఖల్లో అందుబాటులో ఉంటుంది. పెన్షనర్లు ఎస్‌బీఐకి చెందిన ఏదైనా బ్యాంక్ శాఖలో లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించవచ్చు.
కాగా, పెన్షన్ సంబంధిత సేవల్లో ఏదైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు దానికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను support.pensionseva@sbi.co.inకి ఈ-మెయిల్ పంపే వెసులుబాటు కల్పించింది. లేదా UNHAPPY అని 80082 02020కి ఎస్సెమ్మెస్ చేయవచ్చు. 24×7 కస్టమర్‌కేర్ సర్వీస్ ద్వారా 1800 425 3800/1800 112 211 టోల్‌ఫ్రీ నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉంటుంది. బ్యాంకు వెబ్‌సైట్ bank.sbi/dgm లేదా.. ఈమెయిల్ అడ్రస్‌లు customer@sbi.co.in/gm.customer@sbi.co.in కు మెయిల్ చేయవచ్చు.