Cyber Fraud: భయపెడుతున్న ఆన్‌లైన్ షాపింగ్ స్కామ్! జాగ్రత్తలు ఇలా..

ఫెస్టివల్ సీజన్‌ లో ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువగా చేస్తుంటారు చాలామంది. అయితే ఇదే అదునుగా చేసుకుని సరికొత్త ఆన్‌లైన్ స్కామ్‌లకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఫేక్‌ వెబ్‌సైట్ ఆన్‌లైన్ షాపింగ్ స్కామ్‌ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Cyber Fraud: భయపెడుతున్న ఆన్‌లైన్ షాపింగ్ స్కామ్! జాగ్రత్తలు ఇలా..
Cyber Fraud

Updated on: Oct 21, 2025 | 1:42 PM

గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్ షాపింగ్ పెరగడంతో సైబర్ నేరస్థులు కొత్త రకం స్కామ్స్ ను అమలు చేస్తున్నారు. నకిలీ ఇ-కామర్స్ వెబ్‌సైట్స్ క్రియేట్ చేసి ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలాంటి కేసులు  దేశవ్యాప్తంగా అనేక చోట్ల వెలుగులోకి వస్తున్నాయి. కస్టమర్లు ఆన్‌లైన్ ఆర్డర్ చేసి పేమెంట్ చేస్తున్నారు. కానీ ఎలాంటి ప్రొడక్ట్స్ అందుకోవట్లేదు. తీరా ఆరా తీస్తే అవన్నీ ఫేక్ సైట్స్ అని తేలింది. అసలు  స్కామ్ ఎలా ఉంటుందంటే..

స్కామ్ ఇలా..

ఆన్‌లైన్ లో షాపింగ్ చేసేవాళ్లను టార్గెట్ గా చేసుకుని స్కామర్లు కొత్త రకం స్కామ్ అమలు చేస్తున్నారు. ఆఫర్లు, డిస్కౌంట్ల పేర్లతో ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ స్కామ్ లో స్కామర్లు ముందుగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ను పోలి ఉండే నకిలీ ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లు క్రియేట్ చేస్తారు. అందులో ఆకర్షణీయమైన ఆఫర్‌లు, భారీ డిస్కౌంట్‌లు ఉన్నట్టు పోస్టర్ లు పెట్టి కింద లింక్ పోస్ట్ చేస్తారు. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఒక నకిలీ ఇ–కామర్స్ సైట్ ఓపెన్ అవుతుంది. అది అచ్చం నిజమైన సైట్ లాగే అనిపిస్తుంది. అందులో ప్రొడక్ట్స్ కూడా కనిపిస్తాయి. కస్టమర్లు వాటిని కొనుగోలు చేస్తే మోసపోయినట్టే. ఎందుకంటే వీటికి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు. పేమెంట్ ముందుగానే చేసేయాలి. పేమెంట్ చేశాక ఎన్ని రోజులు వెయిట్ చేసినా ప్రొడక్ట్ ఇంటికి రాదు. కొంతకాలానికి అసలు వెబ్ సైట్ కూడా అదృశ్యమవుతుంది. ఇదే ఫేక్ ఇ–కామర్స్ స్కామ్. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఈ తరహా మోసాలు ఎక్కువ అయినట్టు సైబర్ పోలీసులు చెప్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

జాగ్రత్తలు ఇలా..

  • సైబర్ నేరస్థులు సోషల్ మీడియా, ఇమెయిల్ లేదా గూగుల్ ప్రకటనల ద్వారా ఈ ఫేక్ వెబ్‌సైట్స్ లింక్స్ ను పోస్ట్ చేస్తారు. కాబట్టి అలాంటి యాడ్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. వెబ్‌సైట్ URL ని జాగ్రత్తగా చెక్ చేయాలి. వెబ్‌సైట్ స్పెలింగ్ కరెక్ట్ గా ఉందో లేదో చూసుకోవాలి.
  • వెబ్ సైట్ కు ముందు HTTPS అలాగే పక్కన లాక్ సింబల్ ఉండాలి. అప్పుడే అది సేఫ్ సైట్ అని గుర్తు.
  • బాగా చౌకైన ఆఫర్‌లను నమ్మవద్దు. 70–80% వరకు డిస్కౌంట్‌లను చూపించే ఆఫర్‌లు మోసపూరితమైనవి కావొచ్చు.
  • వెబ్ సైట్స్ లో ప్రొడక్ట్స్ కొనేటప్పుడు క్యాష్ ఆన్ డెలివరీని ఎంచుకోండి. తెలియని వెబ్‌సైట్‌లలో ముందస్తు చెల్లింపులు చేయవద్దు.
  • సైబర్ మోసాల బారిన పడి డబ్బు కోల్పోతే వెంటనే సైబర్ పోలీసులకు సమాచారం ఇవ్వండి. లేదా 1930 ను కాల్ చేసి కంప్లెయింట్ ఇవ్వండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..