
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విపరీతంగా పెరిగింది. పెరిగిన వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త ఈవీ మోడల్స్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈవీ కార్లను టాప్ కంపెనీలు కూడా భారత మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా బీవైడీ సీల్, ఫోర్ డోర్ ఎలక్ట్రిక్ కారు రూ. 41 లక్షల ప్రారంభ ధరతో భారతదేశంలో విడుదల చేసింది. ఈ6 ఎంపీవీ, అట్టో 3 ఎస్‌యూవీ తర్వాత భారతీయ మార్కెట్లో కంపెనీ విడుదల చేసిన మూడో కారు ఇదే. బీవైడీ రూ. 1.25 లక్షల బుకింగ్ మొత్తానికి బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. అలాగే ఏప్రిల్ 2024 నుంచి డెలివరీలను ప్రారంభించాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో బీవైడీ సీల్ కారు గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
చైనా ఆధారిత ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ బీవైడీ ప్రస్తుతం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ. భారతీయ మార్కెట్లో సీల్ 4 డోర్ ఎలక్ట్రిక్ కారును ప్రారంభించింది. భారతదేశం జపాను అధిగమించి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటోమోటివ్ మార్కెట్‌గా అవతరించింది. అలాగే ప్రస్తుతం వేగంగా వృద్ధి చెందుతోంది. అలాగే బీవైడీ కూడా టెస్లాను అధిగమించి ప్రపంచంలోనే నంబర్ వన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థగా అవతరించింది. భారత మార్కెట్లో టెస్లా రీ ఎంట్రీకి ముందు భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ స్పేస్లో ప్రారంభ ఆధిపత్యాన్ని నెలకొల్పడానికి బీవైడీ ప్రయత్నిస్తోంది. భారతీయ మార్కెట్లో రిలీజ్ చేసిన సీల్ కారు ఈ-ప్లాట్ఫారమ్ 3.0 ఆధారంగా రూపొందించారు. ఈ కారు 0.219సీడీకు సంబంధించిన తక్కువ డ్రాగ్ కోఎఫీషియంట్‌తో వస్తుంది. ఇది 50:50 యాక్సిల్ లోడ్ పంపిణీనిచేస్తుంది. కంపెనీ మూడు వేరియంట్లు మరియు నాలుగు కలర్ ఆప్షన్లలో సీలు భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. డైనమిక్, ప్రీమియం, పెర్ఫార్మెన్స్ అనే వేరియంట్లను పరిచయం చేశారు. ఈ కారు ఆర్కిటిక్ బ్లూ, అరోరా వైట్, అట్లాంటిస్ గ్రే, కాస్మోస్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
సీల్ మూడు వేరియంట్లు వేర్వేరు పవర్ అవుట్ పుట్‌లతో పాటు రేంజ్‌లతో వస్తుంది. ఎంట్రీ లెవల్ డైనమిక్ వేరియంట్ రియర్ -వీల్ డ్రైవ్ సెటప్ మరియు 61.44 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 201.15 బీహెచ్‌పీ, 310 ఎన్ఎం టార్క్ న్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 510 కిమీల పరిధిని అందిస్తుంది. అలాగే 7.5 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకోగలదు. మిడ్-లెవల్ ప్రీమియం వేరియంట్ వెనుక చక్రాల డ్రైవ్ సెటప్ 82.56 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 308.43 బీహెచ్‌పీ, 360 ఎన్ఎం టార్క్ న్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 650 కిమీల పరిధిని అందిస్తుంది. 5.9 సెకన్లలో 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. లైన్ పెర్ఫార్మెన్స్ వేరియంట్‌లో ఆల్-వీల్ డ్రైవ్ సెటప్‌తో పాటు 82.56 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ వేరియంట్ 522.99 బీహెచ్‌పీ పవర్‌తో 360 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 580 కిమీల పరిధిని అందిస్తుంది. ఈ కారు 3.8 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు వేరియంట్‌ను బట్టి రూ. 41,00,000 నుంచి రూ.51,00,000 వరకూ ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి