
కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. 1952 నాటి పాత స్కీమ్ స్థానంలో కొత్త ఈపీఎఫ్ పథకం 2026 అమల్లోకి తెస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పథకంలో పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌కు సంబంధించి కేంద్రం పలు కీలక మార్పులు చేసింది. ఈపీఎఫ్ఓ కనీస వేతన పరిమితి రూ.15 వేల కంటే ఎక్కువ సంపాదించేవారు నెలకు రూ.1800 కాంట్రిబ్యూట్ చేస్తే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ చెల్లించాలంటే స్వచ్చంధంగా ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఇందుకోసం ఉద్యోగి, యజమాని మధ్య అంగీకారంతో అంతకంటే ఎక్కువ చెల్లించవచ్చు. దీని వల్ల ఉద్యోగులకు టేక్ హోం శాలరీ పెరగనుంది. ఈ నిబంధనల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఉద్యోగి బేసిక్ శాలరీ రూ.15 వేలు ఉంటే ఈపీఎఫ్ఓలో ఖచ్చితంగా చేరాలి. ఉద్యోగి 12 శాతం కాంట్రిబ్యూట్ చేస్తే.. కంపెనీ అందుకు సమానమైన 12 శాతం చెల్లిస్తుంది. దీంతో ఉద్యోగి తన జీతం నుంచి ప్రతీ నెలా రూ.1800 పీఎఫ్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఇక యజమాని కూడా రూ.1800 కాంట్రిబ్యూట్ చేస్తారు. అయితే ఇప్పటివరకు కంపెనీలు రూ.15 వేల కంటే ఎక్కువ బేసిక్ శాలరీ ఉన్నవారికి అసలు జీతంపై పీఎఫ్ లెక్కించేవారు. దీంతో పీఎఫ్‌కు ఎక్కువ చెల్లించాల్సి వచ్చేది. ఎక్కువ శాలరీ ఉన్నవారికి రూ.5 వేలు, రూ.10 వేలు పీఎఫ్ కట్ అయ్యేవి. కానీ ఇక నుంచి రూ.1800 మాత్రమే కట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ కట్ చేయాలంటే యజమాని, ఉద్యోగి ఇద్దరి సమ్మతితో చేసుకోవచ్చు. ఈ నిబంధనను తప్పనిసరి కాకుండా స్వచ్చంధం చేశారు. దీంతో ఉద్యోగికి అవసరమైతే యజమాని అంగీకారంతో ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయవచ్చు.
రూ.1800 మాత్రమే తప్పనిసరిగా చెల్లించాలనే నిబంధనల వల్ల టేక్ హోం శాలరీ తగ్గనుంది. భవిష్యత్తులో ఎక్కువ డబ్బు పొదుపు చేయాలనుకునే ఉద్యోగులు స్వచ్చంధంగా ఎక్కువ మొత్తం చెల్లించవచ్చు. ఉద్యోగి ఎక్కువ చెల్లిస్తే.. యజమాని కూడా అందుకు సమానంగా చెల్లించాలి. ఇక యజమానులకు కూడా దీని వల్ల ఊరట కలగనుంది. ఎక్కువమంది ఉద్యోగులు ఉన్న కంపెనీలకు ఖర్చులను తగ్గించనుంది. దీంతో పాటు ఈపీఎఫ్ఓ కొత్త పథకంలో పలు మార్పులు చేసింది. ఇక నుంచి మెడికల్ ఎమర్జెన్సీ కోసం ఏడాదికి రెండుసార్లు మాత్రమే పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. ఇక కంపెనీలు మారినా ఏడాదికి రెండుసార్లు మాత్రమే నగదు ఉపసంహరించుకోవచ్చు. ఈ మేరకు కేంద్రం పలు పరిమితులు విధించింది. పాక్షిక ఉపసంహరణలపై కూడా పీఎఫ్ పలు నిబంధనలు అమల్లోకి తెచ్చింది.