అప్టెరా మోటార్స్ సూర్యుడి నుంచి శక్తిని తీసుకునేలా సోలార్ ఎలక్ట్రిక్ వాహనాన్ని యూఎస్‌లోని లాస్ వెగాస్‌లో ఇటీవల నిర్వహించిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2025లో ఆవిష్కరించింది. సమీకృత సోలార్ ప్యానెల్స్‌తో కూడిన ఈ ఫ్యూచరిస్టిక్ కారు ప్రపంచంలోనే మొట్టమొదటి సోలార్ పవర్‌తో నడిచే ఈవీ కారుగా రికార్డులను నమోదు చేసింది. ప్రతిరోజూ 60 కిలోమీటర్ల పరిధిని ప్లగ్ ఇన్ చేయకుండానే తిరగవచ్చని ఆ కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. యూఎస్ ఆధారిత స్టార్టప్ సోలార్ కారు కోసం దాదాపు 50,000 బుకింగ్‌లను పొందిందని వివరిస్తున్నారు. ఆప్టెరా సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ కారు డిజైన్ ప్రత్యేకంగా ఉంటుంది. రెక్కలు లేని ఎగిరే కారులా కనిపించే రెండు సీట్ల పాడ్గా కనిపిస్తుంది.
ఈ కారులో నాలుగు సోలార్ ప్యానెల్స్ ఉంటుంది. ప్రతి ఒక్కటి హుడ్, డాష్, రూఫ్, హాచ్ పై ఉంటుంది. ఈ ప్యానెల్స్ 700 వాట్ల వరకు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని వివరిస్తున్నారు. సౌరశక్తితో నడిచే ఈ ఈవీను ఒక్కసారి ఛార్జ్ 643 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ హామీ ఇచ్చింది. సోలార్ ప్యానెల్స్ ఈ ఈవీని ఒక గంటలోపు పూర్తిగా రీఛార్జ్ చేయడంలో సహాయపడతాయి. ఎలక్ట్రిక్ కారు చాలా ఎండ పరిస్థితుల్లో ఉపయోగిస్తే ఒక సంవత్సరంలో 16,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ సౌరశక్తితో డ్రైవింగ్ చేయవచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ మూడు చక్రాల ఎలక్ట్రిక్ కారు చాలా తేలికగా ఉంటుంది. కార్బన్ ఫైబర్ షీట్ మౌల్డింగ్ సమ్మేళనంతో ఈ కారును తయారు చేశారు.
అప్టేరా కంపెనీ చెబుతున్న వివరాల ప్రకారం సౌరశక్తితో పనిచేసే ఈవీకు సంప్రదాయ వాహనాల తయారీకి అవసరమైన భాగాల్లో పదో వంతు కంటే తక్కువ అవసరం. ఇటలీలోని టురిన్‌లోని పినిన్ఫరినాకు సంబంధించిన విండ్ టన్నెల్లో అభివృద్ధి చేసిన ఏరోడైనమిక్స్ మెటీరియల్‌ను ఈ కారు తయారీకు వాడారు. ముఖ్యంగా ఆటోమోటివ్ పరిశ్రమలో రికార్డు అయిన 0.13 డ్రాగ్ కోఎఫీషియంట్‌ను కూడా ఈ కారు పొందింది. అప్టెరా మోటార్స్ సహ సీఈఓ క్రిస్ ఆంథోనీ ఈ కారు రిలీజ్ గురించి మాట్లాడుతూ ఈ కారు ద్వారా చాలా తక్కువ నిర్వహణ ఖర్చుతో ఈ కారును వాడవచ్చని చెబుతున్నారు. సీఈఎస్-2025లో ఈ కారును రిలీజ్ చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అప్టేరా సోలార్ కారు ఫ్రంట్-వీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 198 బీహెచ్‌పీ శక్తిని అందిస్తుందని పేర్కొంటున్నారు. ఈ కారు దాదాపు ఆరు సెకన్లలో సున్నా నుంచి 100 కిమీ వేగంతో దూసుకుపోతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి