
పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం భారత్‌లో ఇంధన ధరలపై పడటం మొదలైంది. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ అయిన నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దాదాపు 6,976 పెట్రోల్ పంపులను నిర్వహిస్తున్న ఈ సంస్థ.. లీటరు పెట్రోల్‌పై రూ. 5 వరకు.. డీజిల్‌పై రూ. 3 వరకు ధరలను పెంచింది.
ధరల పెంపునకు కారణాలు..
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా 50 శాతం పెరిగాయి. చమురు ధరలు బ్యారెల్‌కు 119 డాలర్లకు చేరుకోవడంతో, ప్రైవేట్ చమురు సంస్థలపై ఆర్థిక భారం పెరిగింది. ప్రభుత్వ రంగ సంస్థల వలె ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వ రాయితీలు ఉండవు. దీనివల్ల పెరిగిన దిగుమతి ఖర్చులను భరించలేక, నయారా ఎనర్జీ ఆ భారాన్ని వినియోగదారులపై వేయక తప్పలేదు. స్థానిక పన్నులు, వ్యాట్ (VAT) కారణంగా ధరల పెంపు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర లీటరుకు గరిష్టంగా రూ. 5.30 వరకు పెరిగినట్లు సమాచారం. నయారా ఎనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, రిలయన్స్, బిపి సంయుక్త భాగస్వామ్యమైన ‘జియో-బిపి’, ప్రభుత్వ రంగ సంస్థలు సాధారణ గ్రేడ్ పెట్రోల్ ధరలను ప్రస్తుతానికి యథాతథంగా ఉంచాయి.
యుద్ధం కారణంగా సరఫరాలో అంతరాయం కలిగే అవకాశం ఉందన్న వార్తలతో హైదరాబాద్ వంటి నగరాల్లో పెట్రోల్ పంపుల వద్ద జనం క్యూ కడుతున్నారు. అయితే, భారత రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, చమురు దిగుమతుల్లో 70 శాతం ఆఫ్రికా, అమెరికా దేశాల నుంచి వస్తున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మీదుగా వచ్చే చమురుపై మన ఆధారపడటం తగ్గించామని, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.