జాతీయ ఫించను పథకాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ సన్నద్ధమైంది. ఎన్‌పీఎస్ చందాదారులు పదవీవిరమణ నాటికి మరింత నిధిని సమకూర్చుకునేందుకు గానూ కొత్త ప్రణాళికల రచించనుంది. ఈక్వీటీ పెట్టుబడుల కేటాయింపులను పెంచడం, మరింత మంది ఫండ్ మేనేజర్లను అందుబాటులోకి తీసుకురావడం వంటి వివిధ మార్పులను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది. పింఛను రంగం నిర్వహిస్తున్న దాదాపు రూ.35 లక్షల కోట్ల ఆస్తి విలువలో ఎన్‌పీఎస్ వాటా 21 శాతంగా ఉంది. ప్రస్తుతం ఎన్‌పీఎస్ రూ.7.30 లక్షల కోట్ల విలువైన చందాదారుల ఆస్తిని నిర్వహిస్తోంది. ఎన్‌పీఎస్‌లో టైర్-I, టైర్-II అని రెండు ఖాతాలు ఉంటాయి. టైర్-I ఖాతా దీర్ఘకాల లాక్-ఇన్ పీరియడ్‌తో ఉంటుంది.
ఎన్‌పీఎస్ చందాదారులు ఈక్వీటీ, ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్లు.. ఇలా మూడు అసెట్ క్లాస్‌లలో తమ పెట్టుబడులు కేటాయించుకునేందుకు ఎన్‌పీఎస్ అనుమతిస్తుంది. ప్రత్యామ్నాయ ఆస్తులలో పెట్టుబడులను కూడా ఎన్‌పీఎస్ పెట్టుబడి పెట్టొచ్చు. చందాదారులు ‘యాక్టివ్ ఛాయిస్ అసెట్ ఎలోకేషన్’ను ఎంచుకుంటే సంవత్సరానికి రెండు సార్లు మాత్రమే ఆస్తి కేటాయింపులను మార్చుకునే అవకాశం ఉంది. అయితే, ఇప్పుడు టైర్-I, టైర్-II ఖాతాల కోసం ఆస్తి కేటాయింపును మార్చుకునేందుకు చందాదారులకు 4 సార్లు అవకాశం ఇవ్వాలని పీఎఫ్ఆర్‌డీఏ భావిస్తోంది. ఈ ఆప్షన్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. పెన్షన్ ఫండ్ మేనేజర్‌ను మాత్రం ఏడాదిలో ఒకసారి మాత్రమే మార్చుకునేందుకు మాత్రమే అవకాశం ఉంది. ఎన్‌పీఎస్ టైర్-II ఖాతాదారులు పెట్టుబడులను 100 శాతం ఈక్విటీలకు కేటాయించే అవకాశం ఇచ్చే దిశగా ఆలోచిస్తోంది. ఎన్‌పీఎస్‌కి సంబంధించి ప్రతి పెన్షన్ ఫండ్ మేనేజర్ రిస్క్ ప్రొఫైల్‌ని ఎన్‌పీఎస్ చందాదారుడు తెలుసుకునే అవకాశం ఉంది.