Aerpace: అద్భుతం చేసిన ఎయిర్‌పేస్.. లక్ష పెడితే రూ.42.40 లక్షలు ఇచ్చిన కంపెనీ

ఎయిర్‌పేస్ ఇండస్ట్రీస్ తన పెట్టుబడిదారులకు అదిరే లాభాలను తెచ్చిపెట్టింది. వారి పెట్టుబడిని ఏకంగా 4240 రెట్లు పెంచింది. దీంతో ఆ కంపెనీ స్టాక్ హోల్డర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా కంపెనీ స్టాక్ మరోసారి పెరుగుదలను నమోదు చేసింది. ఈ కంపెనీకి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Aerpace: అద్భుతం చేసిన ఎయిర్‌పేస్.. లక్ష పెడితే రూ.42.40 లక్షలు ఇచ్చిన కంపెనీ
Aerpace

Updated on: Aug 20, 2025 | 4:00 PM

ఒక చిన్న కంపెనీ తన పెట్టుబడిదారులకు అదిరే లాభాలను తెచ్చిపెట్టింది. గత ఐదేళ్లలో ఆ కంపెనీ షేర్లు ఏకంగా 4240శాతం లాభాలను ఇచ్చాయి. చిన్న టెక్నాలజీ కంపెనీ అయిన ఎయిర్‌పేస్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా పెరిగాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి చెందిన ఒక ప్రముఖ రక్షణ సంస్థ నుండి కంపెనీ లెటర్ ఆఫ్ ఇంటెంట్ పొందడమే దీనికి ప్రధాన కారణం. ఎయిర్‌పేస్ షేర్ల ధర రూ.25 లోపే ఉన్నప్పటికీ 5 శాతం పెరిగి రూ.21.70కి చేరింది. గత 5 ఏళ్లుగా ఎయిర్‌పేస్ షేర్లు తమ పెట్టుబడిదారులకు అద్భుతమైన లాభాలను అందించాయి. 5 సంవత్సరాల క్రితం ఈ స్టాక్‌లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు ఆ మొత్తం దాదాపు రూ.42.40 లక్షలకు పెరగడం గమనార్హం. అంటే ఈ కాలంలో కంపెనీ షేర్లు ఏకంగా 4240శాతం రాబడిని ఇచ్చాయి.

యూఏఈ రక్షణ సంస్థతో డీల్..

ఎయిర్‌పేస్ ఇండస్ట్రీస్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ గురించి కీలక విషయాలను వివరించింది. ఈ ఎల్‌వోఐ ప్రకారం.. యూఏఈ రక్షణ సంస్థ ఎయిర్‌పేస్ తయారు చేసిన అధునాతన రక్షణ డ్రోన్‌లపై ఆసక్తిని వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఆ సంస్థ అధికారులు త్వరలో భారత్‌కు వచ్చి ఎయిర్‌పేస్ డ్రోన్ల లైవ్ డెమోను చూస్తారని కంపెనీ తెలిపింది. డెమో సంతృప్తికరంగా ఉండి సాంకేతిక సామర్థ్యాలను ఆమోదిస్తే, యూఏఈ తమ రక్షణ అవసరాల కోసం ఎయిర్‌పేస్ డ్రోన్‌లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే గోప్యత కారణంగా ఆ సంస్థ పేరును ఎయిర్‌పేస్ ఇంకా వెల్లడించలేదు.

భవిష్యత్తు ప్రణాళికలు

కంపెనీ పురోగతి అంతగా కనిపించడం లేదని కొంతమంది వాటాదారులు ఆందోళన చెందుతుండటంపై ఎయిర్‌పేస్ స్పందించింది. సౌరశక్తి, రక్షణ డ్రోన్‌లు, అర్బన్ ఏరియల్ మొబిలిటీ, అధునాతన మౌలిక సదుపాయాలు వంటి వివిధ రంగాలపై నిరంతరం పనిచేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇవి క్లిష్టమైన, బహుళ-దశల ప్రాజెక్టులని, వాణిజ్య స్థాయికి రావడానికి పరిశోధన, ప్రోటోటైపింగ్, అనుమతులకు సమయం పడుతుందని వివరించింది. ఈ దశలో వాటాదారుల సహనం, నమ్మకం చాలా ముఖ్యమని పేర్కొంది.

కంపెనీ ఆర్థిక పనితీరు

ఆర్థికంగా చూస్తే.. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ నష్టం రూ.1.76 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే సమయంలో ఈ నష్టం రూ.0.94 కోట్లుగా ఉంది. అయితే మార్చి త్రైమాసికంలో నమోదైన రూ.3.3 కోట్ల నష్టం కంటే ఇది తక్కువ. ఏప్రిల్-జూన్ మధ్య కంపెనీ మొత్తం ఆదాయం రూ.13.91 లక్షలుగా ఉంది. ఇది గత సంవత్సరం కంటే కొంచెం ఎక్కువ.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..