
మన దేశంలో ముఖేశ్ అంబానీ పరిచయం అక్కరలేని పేరు. రిలయన్స్ గ్రూప్ అధినేతగా.. దేశంలోనే అత్యంత సంపన్నుడిగా ఆయన పేరు అందరికీ సుపరిచితమే. ఇండియన్ బిజినెస్ టైకూన్ గా ఆయన కొనసాగుతున్నారు. గ్లోబల్ వైడ్‌గా కూడా ఆయన విజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక మైలురాయిని అందుకున్నారు. ఏకంగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ లను అధిగమించి ఈ ఘనత సాధించారు. ఇటీవల ప్రకటించిన బ్రాండ్ గార్డియన్‌షిప్ ఇండెక్స్ 2024లో ఏకంగా ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచారు. వరుసగా రెండో సారి అంబానీ ఈ ఘనత సాధించడం విశేషం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
భారతదేశంతో సహా ఆసియాలో అత్యంత సంపన్నుడిగా పేరు తెచ్చుకున్న ముఖేష్ అంబానీ, బ్రాండ్ గార్డియన్‌షిప్ ఇండెక్స్ 2024లో ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచారు. బ్రాండ్ ఫైనాన్స్ తరఫున తయారు చేసిన ఈ జాబితాలో ఆయనకు ఈ గౌరవప్రదమైన స్థానం లభించింది. ఈ విజయంతో ముఖేష్ అంబానీ బ్రాండ్ గార్డియన్‌షిప్‌లో పెద్ద వ్యాపారవేత్తలను అధిగమించారు. ఇందులో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పేర్లు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో టెన్సెంట్‌కు చెందిన హుటెంగ్ మా మొదటి స్థానంలో ఉన్నారు. కాగా ఈ జాబితాలో టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఐదో స్థానంలో నిలిచారు. గతేడాది అంటే 2023లో ఆయన ఎనిమిదో స్థానంలో ఉన్నారు. వీరి తర్వాత మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన అనీష్ షా (ఆరో స్థానం), ఇన్ఫోసిస్ సలీల్ పరేఖ్ (16వ స్థానం) ఉన్నారు. ఆశ్చర్యకరంగా, గతేడాది కూడా ఈ జాబితాలో ముఖేష్ అంబానీ రెండో స్థానంలోనే ఉండటం విశేషం.
సంస్థ పాటిస్తున్న ప్రమాణాలు.. ఉద్యోగులు, పెట్టుబడిదారులు, సమాజం అవసరాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు సమతుల్య వ్యాపార విలువలను పరిగణించే వ్యవస్థాపకులకు ఈ జాబితాలో ర్యాంకింగ్ ఇస్తారు. ఈ ర్యాంకింగ్స్ లో వివిధ విభాగాల్లో ఇస్తారు. ఈ క్రమంలో రూపొందించిన ప్రధాన జాబితాలో రెండో స్థానంలో ఉన్న ముకేశ్ అంబానీ ఈ ఏడాది ‘డైవర్సిఫైడ్’ గ్రూపులో మొదటి స్థానంలో నిలిచారు. ఎలోన్ మస్క్, టిమ్ కుక్, సుందర్ పిచాయ్, సత్య నాదెళ్లను అధిగమించి ఆయన ఈ స్థానంలో నిలిచారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ముఖేష్ అంబానీ వార్షికాదాయం దాదాపు 109 బిలియన్ డాలర్లు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..