Business Idea: ఈ పంట సాగు చేస్తే దశ తిరిగినట్టే.. ఎకరానికి లక్షల్లో రాబడి గ్యారంటీ.!

| Edited By: Ravi Kiran

Jul 13, 2023 | 6:43 PM

ఖర్జూరం... ఈ పేరు వింటే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు నోరూరాల్సిందే... తీపిగా, మెత్తగా నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే ఖర్జూర పండ్లు వివిధ రూపాల్లో ప్రపంచ వ్యాప్తంగా లభిస్తాయి.

Business Idea: ఈ పంట సాగు చేస్తే దశ తిరిగినట్టే.. ఎకరానికి లక్షల్లో రాబడి గ్యారంటీ.!
Farm
Follow us on

ఖర్జూరం… ఈ పేరు వింటే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు నోరూరాల్సిందే… తీపిగా, మెత్తగా నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే ఖర్జూర పండ్లు వివిధ రూపాల్లో ప్రపంచ వ్యాప్తంగా లభిస్తాయి… వీటిలో మెత్తటి ఖర్జూరంతో పాటు ఎండు ఖర్జూరాలకు ఆరోగ్యపరంగా విశిష్టస్థానం ఉంది… మానవ మనుగడలో ఎక్కడ ఎలా పుట్టిందో, ఎలా పెరిగిందో సరైన సమాచారం లేదుకానీ మానవుడికి పరిచయమైన తొలి ఆహారవృక్షంగా దీన్ని చెబుతారు…. పర్షియన్‌ గల్ఫ్‌లో పుట్టిన ఈ చెట్టును క్రీస్తుపూర్వం సుమేరియన్లు తొలిసారి సాగుచేశారని భావిస్తారు… ఆ తరువాత అరబ్బుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విస్తరించినట్టు చెబుతారు… అందుకే ముస్లింలు, యూదులు, క్రైస్తవులకు ఈ చెట్టు ఎంతో ముఖ్యమైనదిగా మారింది.

సౌదీ నుంచి గిద్దలూరు వయా తమిళనాడు…

ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఓ రైతు వ్యవసాయంలో నూతన ఓరవడి సృష్టిస్తున్నారు. గిద్దలూరుకు చెందిన రైతు సుబ్రహ్మణ్యం ఆరు ఎకరాలలో ఖర్జూర పంట వేసి అందర్నీ ఆకర్షిస్తున్నారు. ఖర్జూరపు చెట్లు నాటిన తర్వాత రెండు సంవత్సరాల నుంచి దాదాపు 70 సంవత్సరాల వరకు దిగుబడి వస్తుందని రైతు సుబ్రహ్మణ్యం తెలిపారు. ఒక్కొక్క మొక్క 4,500 రూపాయల ధర పలుకుంటుందని తెలిపారు. ఖర్జూర మొక్కలు అధికంగా తమిళనాడు రాష్ట్రంలో దొరుకుతాయని చెబుతున్నారు. ఒక్కొక్క చెట్టుకు ప్రతిసారి 500 కేజీల నుంచి 600 కేజీల వరకు ఖర్జూర పంట వస్తుందని అన్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లలో వంద రూపాయల నుంచి 200 రూపాయల మధ్య కేజీ ఖర్జూర పండ్లు ధర పలుకుతున్నాయి. ఖర్జూర పండ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది కావడంతో ప్రజలు అధికంగా ఖర్జూర పండ్లు తినటానికి ఆసక్తి చూపిస్తుంటారని, అందువల్ల మార్కెట్లో ఖర్జూరపండ్లకు డిమాండ్‌ అధికాంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రైతులకు ఖర్జూరపు పంట వేసేందుకు సబ్సిడీ పైన మొక్కలను ప్రభుత్వం అందిస్తే ప్రత్యామ్నాయ పంటలవైపు రైతులు ఆకర్షితులవుతారని రైతు సుబ్రమణ్యం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

చక్కనమ్మ చిక్కినా అందమే…

ఖర్జూరపండు కండతో ఉన్నప్పుడు ఎంత రుచిగా ఉంటుందో ఎండిపోయి కూడా అంతే రుచిని అందిస్తుంది… ఖర్జూరపండు ఎండినా రుచికరంగానే ఉంటుంది… ఎండు ఖర్జూరంలోని నీళ్లన్నీ ఆవిరైపోవడంతో అది మరింత తియ్యగా మారుతుందట… వేసవిలో ఎండుఖర్జూరాలను రాత్రంగా నీళ్ళలో నానబెట్టుకుని ఉదయం ఆ నీళ్ళను తాగి ఎండు ఖర్జూరాలను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని భావిస్తారు… ఎండు ఖర్జూరాలను వివిధ వంటల్లో, స్వీట్ల తయారీల్లో ఉపయోగిస్తారు… పవిత్ర రంజాన్‌ మాసంలో సేమియాల్లో సైడ్‌ డిష్‌గా ఎండు ఖర్చూరాలు, చక్కెర, కొబ్బరి తురుముతో తయారు చేసిన ” చోబా ” అంటే ముస్లింలు ఎంతో మక్కువ చూపిస్తారు.