
అమెరికాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం మెటాలో భారీ స్థాయిలో ఉద్యోగాల తొలగింపులు జరిగే అవకాశం ఉందని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. కంపెనీ తన మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 20 శాతం మందిని తగ్గించే ప్రణాళికను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇది అమలైతే సుమారు 16,000 మంది ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడవచ్చు. అయితే ఈ నిర్ణయంపై కంపెనీ ఇంకా అధికారికంగా తేదీ లేదా తుది సంఖ్యను ప్రకటించలేదు. కంపెనీ ఫైలింగ్ ప్రకారం.. 2025 డిసెంబర్ 31 నాటికి మెటాలో దాదాపు 79,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో 20 శాతం ఉద్యోగుల కోత అమలైతే, ఇది ఇటీవల కాలంలో కంపెనీ చేపట్టే అతిపెద్ద పునర్‌వ్యవస్థీకరణ చర్యగా నిలవొచ్చు. ఇప్పటికే గతంలో కూడా మెటా భారీగా ఉద్యోగాల తొలగింపులు చేపట్టింది.
నవంబర్ 2022లో మెటా సుమారు 11,000 మంది ఉద్యోగులను తొలగించింది. అది అప్పటి మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 13 శాతం. తరువాత నాలుగు నెలల వ్యవధిలో మరోసారి దాదాపు 10,000 ఉద్యోగాల కోతలను ప్రకటించింది. ఇప్పుడు ఖర్చులను తగ్గించడం, సంస్థ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా మార్చడం కోసం మరోసారి ఉద్యోగాల కోతలపై చర్చలు జరుగుతున్నాయి. మెటా సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ గత ఏడాది నుంచి కంపెనీని జనరేటివ్ AI రంగంలో ముందంజలో నిలిపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మెటా కొత్త సూపర్ ఇంటెలిజెన్స్ టీమ్ కోసం అగ్రశ్రేణి AI పరిశోధకులను నియమించేందుకు భారీ జీత ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. కొన్ని ఒప్పందాలు నాలుగేళ్లలో వందల మిలియన్ల డాలర్ల విలువ కలిగినవిగా నివేదించబడ్డాయి.
ఇదే సమయంలో కంపెనీ డేటా సెంటర్ మౌలిక సదుపాయాలపై కూడా భారీగా పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. 2028 నాటికి సుమారు 600 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టే ప్రణాళిక ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. మెటా ఇటీవల AI రంగంలో మరింత దూకుడు చూపుతోంది. AI ఏజెంట్ల కోసం రూపొందించిన సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ Moltbookను కంపెనీ ఇటీవల కొనుగోలు చేసింది. అలాగే చైనాకు చెందిన AI స్టార్టప్ Manusను కొనుగోలు చేయడానికి సుమారు 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు కూడా మెటా సిద్ధమవుతోందని సమాచారం. మొత్తంగా చూస్తే భవిష్యత్తులో AI ఆధారిత వ్యాపార మోడల్‌ను బలోపేతం చేయడానికి మెటా భారీ పెట్టుబడులు పెట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా ఖర్చులను తగ్గించి, చిన్న కానీ మరింత సమర్థవంతమైన బృందంతో పనిచేయాలనే దిశగా కంపెనీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి