Maruti Suzuki SkyDrive: ఓలా, ఉబెర్ తరహాలో ఎయిర్ ట్యాక్సీలు.. మారుతీ సుజుకీ అద్భుత ఆవిష్కరణ..

ఈ క్రమంలో దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఓ కీలక అప్ డేట్ అందించింది. త్వరలోనే తాము ఆకాశాన్ని అందుకుంటున్నామని ప్రకటించింది. ఏంటి అర్థం కాలేదా? ఈ కంపెనీ తన మాతృసంస్థ అయిన జపనీస్ సుజుకీ సహాయంతో ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్ ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పింది. ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్లు డ్రోన్ కంటే కాస్త పెద్దవిగా, హెలికాప్టర్ కంటే చిన్నవిగా ఉంటాయి.

Maruti Suzuki SkyDrive: ఓలా, ఉబెర్ తరహాలో ఎయిర్ ట్యాక్సీలు.. మారుతీ సుజుకీ అద్భుత ఆవిష్కరణ..
Maruti Suzuki Sky Drive

Updated on: Feb 16, 2024 | 7:53 AM

ఎగిరే కార్ల గురించి గత కొంత కాలంగా వింటున్నాం. కానీ అవి అందుబాటులోకి రాలేదు. సాంకేతికంగా అభివృద్ధి చెందిన కొన్ని దేశాలో వీటిపై ప్రయోగాలు కొనసాగిస్తున్నాయి. కొన్ని చోట్ల పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఓ కీలక అప్ డేట్ అందించింది. త్వరలోనే తాము ఆకాశాన్ని అందుకుంటున్నామని ప్రకటించింది. ఏంటి అర్థం కాలేదా? ఈ కంపెనీ తన మాతృసంస్థ అయిన జపనీస్ సుజుకీ సహాయంతో ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్ ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పింది. ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్లు డ్రోన్ కంటే కాస్త పెద్దవిగా, హెలికాప్టర్ కంటే చిన్నవిగా ఉంటాయి. పైలెట్ సహా ముగ్గురు ప్రయాణికులతో తీసుకెళ్ల సామర్థ్యంతో వస్తుందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఓలా, ఉబెర్‌ల తరహాలో..

మారుతీ సుజుకీ తీసుకురానున్న ఈ ఎయిర్ టాక్సీలు ప్రస్తుతం సిటీల్లో అందుబాటులో ఉన్న ఓలా, ఉబెర్ వంటి ట్యాక్సీల మాదిరిగా పనిచేయనున్నాయి. అంటే మరో కొత్త విప్లవాత్మక మార్పునకు ఇది నాంది పలకబోతోంది. అయితే మన దేశంలో లాంచ్ అయ్యే ముందు వీటిని జపాన్, యూఎస్ లలో తీసుకురావాలని చూస్తున్నారు.

మారుతి సుజుకి ప్రస్తుతం భారతదేశపు అత్యంత విలువైన వాహన తయారీ సంస్థ. దీని మార్కెట్ విలువ రూ. 3.36 లక్షల కోట్లు. రూ. 3.34 లక్షల కోట్లతో టాటా మోటార్స్‌ దీని తర్వాత స్థానంలో ఉంది. గత వారం భారతదేశ ఆటో రంగానికి సంబంధించిన మరో ప్రధాన ప్రకటనలో, హ్యుందాయ్ ఈ సంవత్సరం దీపావళి 2024 నాటికి భారతదేశంలో ఐపీఓని ప్రారంభించాలని యోచిస్తున్నట్లు సమాచారం .

ఇవి కూడా చదవండి

స్కై డ్రైవ్ పేరుతో..

మారుతీ సుజుకి తమ ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్లకు స్కైడ్రైవ్ అని పేరు పెట్టాలని నిర్ణయించింది . 12 మోటారు, రోటర్ యూనిట్లతో, ఇది జపాన్‌లో 2025 ఒసాకా ఎక్స్‌పోలో ప్రారంభమవుతుందని అంచనా. ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవ ద్వారా చివరికి ఈ టెక్నాలజీని భారతదేశానికి పరిచయం చేయాలని మారుతి భావిస్తున్నప్పటికీ తొలుత జపాన్, యుఎస్‌లలోనే ఇది లాంచ్ చేసేందుకు సుజుకీ మొగ్గుచూపుతోంది.

సాధారణ హెలికాప్టర్ తో పోల్చితే..

ఎయిర్ కాప్టర్ సాధారణ హెలికాప్టర్ కంటే దాదాపు సగం బరువు ఉంటుందని, టేకాఫ్ సమయంలో బరువు 1.4 టన్నులు ఉంటుందని తెలుస్తోంది. తక్కువ బరువు ఉన్నందున ఇది టేకాఫ్ తోపాటు ల్యాండింగ్ కూడా ఏదైనా భవనం పైకప్పులపై అయిపోతుంది. ఇది ఎలక్ట్రిక్ వేరియంట్ కాబట్టి విమాన భాగాల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల ఉంటుందని నివేదిక పేర్కొంది. ఇది తయారీ మరియు నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుంది.

మారుతీ సుజుకీ లక్ష్యం ఇదే..

యూఎస్, జపనీస్ మార్కెట్‌లతో ప్రారంభించి, క్రమంగా భారతదేశానికి వెళ్లే కొత్త మొబిలిటీ సొల్యూషన్‌ల అభివృద్ధిలో అగ్రగామిగా ఉండటమే ఈ ప్రణాళిక లక్ష్యంగా సుజుకీ పనిచేస్తోందని సుజుకి మోటార్ అసిస్టెంట్ మేనేజర్ కెంటో ఒగురా తెలిపారు. అదే సమయంలో విక్రయాల కోసం భారత మార్కెట్‌ను అన్వేషించడంతో పాటు, తయారీ ఖర్చులను తగ్గించుకునేందుకు మారుతి భారతదేశంలోనే తయారీ చేయాలని కూడా తలపోస్తోంది. అందుకోసం కంపెనీ ఏవియేషన్ రెగ్యులేటర్ మన డీజీసీఏతో చర్చలు జరుపుతోందని అని చెప్పారు. దీని సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి వివరాలు వెల్లడిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..