Mutual Funds Loans: మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లోన్ సౌకర్యం.. వడ్డీ రేటు ఎంతో తెలుసా?

భారతదేశంలో భవిష్యత్ గురించి ఆలోచించి పొందుపు చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. గతంలో పెట్టుబడిదారులు స్థిర ఆదాయాన్ని ఇచ్చే చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడి పెడితే ప్రస్తుతం తక్కువ సమయంలో ఎక్కువ రాబడినిచ్చే మ్యూచువల్ ఫండ్స్ వంటి పథకాల్లో పెట్టుబడి పెడుతున్నారు. అయితే అనుకోని అవసరం వస్తే మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై కూడా లోన్స్ తీసుకోవచ్చని చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లోన్ పొందడం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Mutual Funds Loans: మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లోన్ సౌకర్యం.. వడ్డీ రేటు ఎంతో తెలుసా?

Updated on: Mar 18, 2025 | 4:25 PM

ఇటీవల కాలంలో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా చాలా మంది అధిక రాబడిని ఆర్జిస్తున్నారు. అయితే మ్యూచువల్ పండ్స్‌లో పెట్టుబడితో ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు వివరిస్తున్నారు. పెట్టుబడిదారులు అనుకోని సందర్భంలో సొమ్ము అవసరం పడినప్పుడు ఎస్ఐపీను రీడీమ్ చేసుకుంటారు. అయితే మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులు వాటిని అమ్మకుండా తనఖా పెట్టడం ద్వారా రుణం పొందవచ్చని పేర్కొంటున్నారు. దీనిని క్లుప్తంగా ఎల్ఏఎంఎఫ్ (ఎంఎఫ్ పై రుణం) అంటారు. ఇలా రుణం పొందితే పెట్టుబడి కూడా చెక్కుచెదరకుండా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ల ద్వారా రుణం ఎలా పొందాలో? ఏ ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలో? వడ్డీ రేటు ఎలా ఉంటుంది? వంటి వివరాలను తెలుసుకుందాం. 

భారతీయ మ్యూచువల్ ఫండ్ యూనిట్లలో పెట్టుబడి పెట్టిన ఏ భారతీయ నివాసి అయినా మ్యూచువల్ ఫండ్‌పై రుణం పొందవచ్చు. మ్యూచువల్ ఫండ్లను తనఖా పెట్టి రుణం తీసుకోవడం సురక్షితమైనదిగా పరిగణిస్తారు. మ్యూచువల్ ఫండ్స్ తనఖా పెట్టి తీసుకునే రుణాలపై వడ్డీ రేట్లు ఇతర రుణ ఉత్పత్తుల కంటే చౌకగా ఉంటాయి. అయితే రుణం తీసుకునే ముందు మీ పెట్టుబడి లక్ష్యం, కాలపరిమితిని అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే మీ ఆదాయం నుంచి ప్రతి నెలా ఈఎంఐ లేదా వడ్డీ మొత్తాన్ని చెల్లించగలరా? అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంంటున్నారు. మీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు ఇప్పటివరకు ఎలా ఉన్నాయి? భవిష్యత్తులో రాబడి ఎంత? వంటి విషయాలను పాటు మీరు తీసుకునే రుణం మీ స్వల్ప లేదా మధ్యకాలిక ఆర్థిక అవసరాలను తీర్చడంలో సహాయపడుతుందా? అనే విషయాన్ని పరిశీలించాలని పేర్కొంటున్నారు. 

మ్యూచువల్ ఫండ్స్ ద్వారా రుణం తీసుకునే ముందు వడ్డీ రేటు, రుణ కాలపరిమితి, పునరుద్ధరణ ఎంపిక, షార్ట్‌ఫాల్ మార్జిన్ వంటి విషయాలను పరిశీలించాలని నిపుణులు చెబుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్‌ ద్వారా తీసుకునే రుణాలపై వడ్డీ తక్కువగా ఉంటుంది. సాధారణంగా వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు 14 నుంచి 22 శాతం మధ్య ఉంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్ల పేరుతో పొందిన రుణాలపై వడ్డీ రేటు 10.5 శాతం నుంచి 12 శాతం వరకు ఉంటుంది. అయితే ఇలా తీసుకున్న రుణాన్ని ముందుగా చెల్లిస్తే ప్రీ క్లోజర్ జరిమానా ఉండదు. అలాగే కస్టమర్ డబ్బు అందుకున్న తర్వాత, అతను ఎప్పుడైనా రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు. ఈ కాలంలో మ్యూచువల్ ఫండ్ యూనిట్ల విలువ కూడా పెరుగుతూనే ఉంటుంది. ఈ రుణాలు లోన్-టు-వాల్యూ (ఎల్‌టీవీ) నిష్పత్తి ఆధారంగా ఇస్తారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఎన్ఏవీలో 50 శాతం నుంచి 70 శాతం వరకు రుణం పొందవచ్చు. డెట్ మ్యూచువల్ ఫండ్ అయితే ఎన్ఏవీలో 80 శాతం వరకు రుణం పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి