
ఈ-టేస్ట్ ఇంటర్ ఫేస్ పరికరం కొత్తగా అనిపించినా, దీని ద్వారా వర్చువల్ రియాలిటీలో ఆహార పదార్థాల రుచిని తెలుసుకోవచ్చు. వివిధ ప్రయోగాలు చేసిన ఈ విషయాన్ని నిర్ధారణ చేశారు. ఈ పరికరం డిజిటల్ యుగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. వీఆర్ అనుభవాలను మెరుగుపర్చడమే కాకుండా గేమింగ్ హెల్త్ కేర్, యాక్సెసిబిలిటీలో కొత్త విధానాలకు మార్గం ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం పర్చువల్ రియాలిటీ (వీఆర్) హెడ్ సెట్ల వినియోగం విపరీతంగా పెరిగింది. వీటి ద్వారా కాల్పానిక అందాలను చూడవచ్చు. శబ్దాలను, సంగీతాన్ని వింటూ హాయిగా గడపొచ్చు. ఇప్పుడు ఈ విధానంలోనే రుచులను ఆస్వాదించడానికి మార్గం సుగమమైంది. ఇ-టేస్ట్ పరికరంతో ఆ లోటు తీరనుంది. ఇది సెన్సార్లు, రసాయన డిస్పెన్సర్ల సాయంతో ఆయా రుచులను ప్రేరేపిస్తుంది.
సెన్సర్ – అక్యురేట్ ఇంటర్ ఫేస్ తో కూడిన ఇ-టేస్ట్ వ్యవస్థ యూజర్ల నోటితో ఇంటరాక్ట్ అవుతుంది. తీపి, పులుపు, చేదు, ఉప్పు, వగరు రుచులను తెలియజేసే గ్లూక్లోజ్, గ్లుటమేట్ తదితర పదార్థ అణువులను గుర్తిస్తుంది. ఇవి వైర్ లెస్ గా హెడ్ సెట్ కు చేరుకుని, రుచులతో కూడిన రసాయనాలు స్ట్రా వంటి పరికరం ద్వారా నోట్లోకి చేరతాయి. విద్యుదయస్కాంత పంప్, జెల్ ఇంటర్ ఫేస్ తో కూడిన వ్యవస్థ దీనికి వీలు కల్పిస్తుంది. పంపు ద్వారా నిర్ణీత మోతాదుల్లో రసాయక మిశ్రమాలు విడుదల అవుతాయి. జెల్ పొరతో ఇవి చర్య జరిపి రుచిని సవరిస్తాయి. గ్లూకోజుతో తీపి, ఉప్పుతో ఉప్పుదనం, సిట్రిక్ ఆమ్లంతో పులుపు, మెగ్నిషియం క్లోరైడ్ తో చేదు, గ్లుటమేట్ తో నోరూరించే రుచులను కలిగిస్తుంది.
ఇ- టేస్ట్ పరికరంపై అనేక ప్రయోగాలు జరిగాయి. దీని ద్వారా పుల్లటి రుచులను దాదాపు 70 శాతం కచ్చితంగా గుర్తించారు. దూర ప్రాంతాల నుంచి రుచులను ఆస్వాదించగలగడం దీని ప్రత్యేకత. అలాగే కొందరికి అనారోగ్య సమస్యల కారణంగా రుచి తెలియదు. అలాంటి వారికి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది.
పర్చువల్ రియాలిటీ టెక్నాలజీ అనేది కంప్యూటర్ ద్వారా ఒక రకమైన వాతావరణంలో లీనం చేసే ఇంటరాక్టివ్ టెక్నాలజీ. ప్రజలు హెడ్ మౌంటెడ్ డిస్ ప్లే ను ధరించడం ద్వారా వర్చువల్ ప్రపంచంలో విహరించవచ్చు. ఆ ప్రదేశంలో తాము భౌతికంగా ఉన్నట్టు భావించవచ్చు. ఇప్పటి వరకూ చదువు, ఆటలు, సంగీతాన్ని ఆస్వాదించిన ప్రజలు ప్రస్తుతం వచ్చిన టెక్నాలజీతో రుచులను కూడా తెలుసుకునే అవకాశం కలిగింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి