
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. ఆ రోజున కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ప్రతీ ఏడాది ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి ఫిబ్రవరి 1న ఆదివారం వచ్చినప్పటికీ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ ఆ రోజునే బడ్జెట్ విడుదల చేయాలని కేంద్రం భావించింది. దీంతో ఈ సారి బడ్జెట్‌లో ఎలాంటి ట్యాక్స్ మినహాయింపులు ఉంటాయనే దానిపై సామాన్యులతో పాటు వ్యాపార వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో అసలు బడ్జెట్ అంటే ఏమిటి..? బడ్జెట్‌కు డబ్బులు ఎక్కడ నుంచి వస్తుంది..? ప్రభుత్వం దానిని ఎలా ఖర్చు చేస్తోంది..? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రభుత్వ ఆదాయ వనరులు ఏంటి..? ప్రజల నుంచి సేకరించిన ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చు చేస్తారు? ఏ రంగానికి ఎంత ఖర్చు చేస్తారు? ఏ పథకానికి ఎంత ఖర్చు చేస్తారు? అనేది ముందుగా వెల్లడించేదే బడ్జెట్. సింపుల్‌గా బడ్జెట్ అంటే ప్రభుత్వ ఆర్ధిక నివేదిక కార్డుగా చెప్పవచ్చు. ఆదాయం, ఖర్చుకు సంబంధించిన పూర్తి వివరాలు బడ్జెట్ అందిస్తుంది.
ప్రభుత్వానికి ఆదాయం రుణాలు, అప్పుల నుంచి వస్తాయి. గత సంవత్సరం ప్రభుత్వ డేటా ప్రకారం ప్రభుత్వం పొందే ప్రతీ రూపాయికి 24 పైసలు లోన్, ఇతర అప్పుల నుంచి వచ్చాయి. ఇక 22 పైసలు ఇన్‌కమ్ ట్యాక్స్‌ల నుంచి వచ్చాయి. ఇక 18 పైసలు జీఎస్టీ, ఇతర పన్నుల నుండి వస్తాయి. కార్పొరేషన్ పన్నుల నుంచి 17 పైసలు వచ్చాయి. డివిడెంట్లు, వడ్డీ, జరిమానాల నుంచి 9 పైసలు, ఇతర వనుల నుంచి 10 పైసలు వచ్చాయి. ట్యాక్స్‌లు, జీఎస్టీ, ప్రభుత్వ సంస్థల నుంచి డివిడెండ్లు, వడ్డీ ఆదాయం, రుసుములు, జరిమానాల నుంచి ప్రభుత్వానికి ఆదాయం లభిస్తాయి.
రాష్ట్రాలకు సుంకాలు, పన్నులు చెల్లించడానికి ఖర్చు చేస్తుంది. ఇక దేశంలోని ప్రభుత్వ పథకాలు, అభివృద్ది పనులకు ఖర్చు చేస్తుంది. ఇక వడ్డీ చెల్లింపులు, రక్షణ, పెన్షన్, ఇతర ఖర్చులకు ఉపయోగిస్తుంది. ఉదాహరణకు ఒక రూపాయి ఖర్చు చేస్తుందని అనుకుంటే రాష్ట్రాలకు పన్నులు, సంకాల రూపంలో 22 పైసలు చెల్లిస్తుంది. ఇక రుణాలకు వడ్డీ చెల్లించడానికి 20 పైసలు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు 16 పైసలు, రక్షణ కోసం 8 పైసలు, పెన్షన్ కోసం 4 పైసలు, ఇతర ఖర్చుల కోసం 30 పైసలు ఖర్చు చేస్తుంది.