జాయింట్ అకౌంట్ రూల్స్: ఒకరు మరణిస్తే.. మిగతా ఖాతాదారుడు డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చా..?

భార్యభర్తలు లేదా ఇతర వ్యక్తులు కలిసి నిర్వహించే జాయింట్ బ్యాంక్ అకౌంట్‌లో ఒకరు చనిపోతే.. ఆ డబ్బు మొత్తం బ్రతికున్న వారికి లేదా నామినీకి చెందుతుందా అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఈ విషయంలో అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయి. బ్యాంక్ నియమాలు, చట్టపరమైన హక్కులు భిన్నంగా ఉండవచ్చు.

జాయింట్ అకౌంట్ రూల్స్: ఒకరు మరణిస్తే.. మిగతా ఖాతాదారుడు డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చా..?
India Money

Updated on: Oct 04, 2026 | 10:00 PM

జాయింట్ బ్యాంక్ అకౌంట్లు భార్యభర్తల మధ్య ఆర్థిక లావాదేవీలను మరింత సులువు చేస్తాయి. అయితే అకౌంట్ హోల్డర్లలో ఒకరు మరణించినప్పుడు.. ఆ అకౌంట్‌లోని డబ్బుపై అసలు హక్కు ఎవరిది అనే ప్రశ్న తరచుగా తలెత్తుతుంది. సర్వైవర్ లేదా నామినీకి డబ్బు అందినప్పటికీ.. వారు ఆ డబ్బుకు పూర్తి యజమానులు అవుతారా లేదా అనేది చాలామందికి తెలియని విషయం. చట్టపరమైన నిబంధనలు, బ్యాంకు ప్రక్రియలు, వారసత్వ చట్టాల వల్ల ఈ అంశం సంక్లిష్టంగా మారవచ్చు. అకౌంట్ హోల్డర్లలో ఒకరు మరణించినప్పుడు.. బ్యాంక్ సాధారణంగా మిగిలిన జాయింట్ అకౌంట్ హోల్డర్‌కు నిధులను విడుదల చేస్తుంది. బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం ఇది సరైనదే అయినప్పటికీ.. చట్టపరంగా సర్వైవర్ ఆ డబ్బుకు పూర్తి యజమాని కాకపోవచ్చు. ఇండియన్ వారసత్వ చట్టాల ప్రకారం.. మరణించిన వ్యక్తి లీగల్ వారసులకు ఆ ఆస్తిపై హక్కు ఉంటుంది. సర్వైవర్ ఆ డబ్బుకు కేవలం ట్రస్టీగా మాత్రమే వ్యవహరించాలి. మరణించిన వ్యక్తి వారసులు తమ వాటాను డిమాండ్ చేస్తే, సర్వైవర్ వారికి ఆ వాటాను అందించాల్సి రావచ్చు.

జాయింట్ అకౌంట్ హోల్డర్లు అందరూ మరణించినప్పుడు లేదా సింగిల్ అకౌంట్‌లో అకౌంట్ హోల్డర్ మరణించినప్పుడు బ్యాంక్ నామినీకి డబ్బు చెల్లిస్తుంది. అయితే నామినీ కూడా ట్రస్టీగానే పరిగణించబడతాడు. బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్ 1949 ప్రకారం.. బ్యాంకులు నామినీకి డబ్బు చెల్లించడం ద్వారా తమ బాధ్యతను నిర్వర్తిస్తాయి. కానీ, నామినేషన్ అనేది వీలునామా కాదు. నామినీ కేవలం నిధులను స్వీకరించడానికి, లీగల్ వారసులకు బదిలీ చేయడానికి మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరిస్తాడు. లీగల్ వారసులు ఆ డబ్బుకు అసలు యజమానులు. ఇతర వారసులు ఉన్నట్లయితే, నామినీ ఆ డబ్బును వారికి పంపిణీ చేయాలి. జాయింట్ బ్యాంక్ అకౌంట్‌పై వచ్చే వడ్డీకి టీడీఎస్ అనేది మొదటి అకౌంట్ హోల్డర్ పాన్ నంబర్‌పై కట్ అవుతుంది. అయితే అకౌంట్‌లో పెట్టుబడి పెట్టిన నిధులు వేర్వేరు వ్యక్తులకు చెందినవైతే.. వారి పెట్టుబడి నిష్పత్తి ఆధారంగా టీడీఎస్ విడివిడిగా కట్ కావాలని కోరవచ్చు. ఇందుకోసం బ్యాంక్‌కు 37BA డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది.

జాయింట్ బ్యాంక్ అకౌంట్ నుండి వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు ఎవరు క్లెయిమ్ చేయాలనేది చాలా ముఖ్యం. ఇది కేవలం మొదటి హోల్డర్‌కు మాత్రమే పరిమితం కాదు. ఆ అకౌంట్‌లోని డబ్బుల అసలు యజమాని ఎవరు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. వడ్డీ ఆదాయానికి ఎవరు అర్హులైతే, వారే తమ ఆదాయపు పన్ను రిటర్నులలో దానిని చూపించి పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోవాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us