
జమ్మూకశ్మీర్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. షోపియాన్ జిల్లాలో భారీ వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. వడగళ్ల దెబ్బకు ఆపిల్ తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చేతికొచ్చే సమయంలో పంటకు నష్టం జరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా షోపియాన్‌లో వర్షంతో పాటు పెద్ద ఎత్తున వడగళ్లు పడ్డాయి. దీంతో చెట్లపై ఉన్న ఆపిల్స్ దెబ్బతిని నేలరాలాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు కూడా తిరిగి నేలమట్టమయ్యాయి.

షోపియాన్‌కు ఆపిల్ సాగులో ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే ఈ ప్రాంతాన్ని ‘ఆపిల్ జిల్లా’ అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడి వాతావరణ పరిస్థితులు ఆపిల్ సాగుకు అనుకూలంగా ఉండటంతో పెద్ద ఎత్తున తోటలు ఉన్నాయి. షోపియాన్‌లో పండే నాణ్యమైన ఆపిల్స్‌కు మంచి డిమాండ్ ఉంటుంది. ఇక్కడి నుంచి పెద్ద మొత్తంలో ఆపిల్స్ ఇతర దేశాలకు కూడా ఎగుమతులు చేస్తుంటారు.

అయితే తాజా వడగళ్ల వాన రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఎంతో కష్టపడి పెంచిన పంట కళ్లముందే దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టం ఎంత మేరకు జరిగిందన్న పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు

మరోవైపు జమ్మూకశ్మీర్‌లో ఆగస్టు 20 వరకు విడతల వారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతుండటంతో రైతుల్లో మరింత ఆందోళన పెరిగింది. ముఖ్యంగా ఆపిల్ పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు, వడగళ్లు మరింత నష్టం చేస్తాయేమోనని రైతులు భయపడుతున్నారు.