
2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు ప్రక్రియ ప్రారంభమవడంతో, దేశవ్యాప్తంగా లక్షలాది మంది జీతభత్యాలు పొందే ఉద్యోగులు ఇప్పుడు ఫారం 16 కోసం ఎదురుచూస్తున్నారు. ఆదాయపు పన్ను నిపుణుల ప్రకారం, ITR దాఖలు ప్రక్రియలో ఫారం 16 కీలక పత్రంగా పరిగణించబడుతుంది. నియమాల ప్రకారం ఉద్యోగి ఆదాయం ఆర్జించిన ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత వచ్చే మదింపు సంవత్సరంలోని జూన్ 15లోపు యజమానులు ఫారం 16 జారీ చేయాలి. ఒకవేళ గడువు దాటితే యజమానికి రోజుకు రూ.100 చొప్పున జరిమానా విధించే అవకాశం ఉంటుంది.
ఫారం 16 అనేది ఉద్యోగి జీతం నుంచి మినహాయించిన TDS (ట్యాక్స్ డిడెక్షన్ ఎట్ సోర్స్) వివరాలను తెలిపే అధికారిక పత్రం. ఇందులో ఉద్యోగి జీతం, పన్ను మినహాయింపులు, తగ్గింపులు, పెట్టుబడులు, తుది పన్ను బాధ్యత వంటి పూర్తి సమాచారం ఉంటుంది. ఉద్యోగులు తమ యజమాని లేదా కంపెనీ పేరోల్ పోర్టల్ ద్వారా ఈ పత్రాన్ని పొందవచ్చు. ఆర్థిక నిపుణుల ప్రకారం ఒక ఉద్యోగి ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగం మార్చినట్లయితే, ఒక్కో యజమాని నుంచి వేర్వేరు ఫారం 16లు పొందే అవకాశం ఉంటుంది. ఫారం 16లో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి. పార్ట్ A, పార్ట్ B.
పార్ట్ Aలో యజమాని, ఉద్యోగి వివరాలు, PAN, TAN, ఉద్యోగ కాలం, ప్రతి త్రైమాసికంలో మినహాయించిన TDS వివరాలు ఉంటాయి. అలాగే ప్రభుత్వానికి జమ చేసిన పన్ను వివరాలు కూడా ఇందులో కనిపిస్తాయి. ఇక పార్ట్ Bలో ఉద్యోగి జీతానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. HRA, LTA, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, పెన్షన్ వంటి అంశాలతో పాటు, సెక్షన్ 80C, 80D, 80CCD కింద క్లెయిమ్ చేసిన పెట్టుబడులు, పన్ను తగ్గింపులు కూడా ఇందులో పొందుపరుస్తారు. అదనంగా తుది పన్ను చెల్లించాలా లేదా రీఫండ్ వస్తుందా అనే సమాచారం కూడా ఈ భాగంలో ఉంటుంది. నిపుణుల సూచన ప్రకారం ఉద్యోగులు ఫారం 16లోని వివరాలను Form 26AS, AIS వంటి పన్ను పత్రాలతో సరిపోల్చుకుని ITR దాఖలు చేయడం మంచిది. చిన్న పొరపాట్లు కూడా రీఫండ్ ఆలస్యం లేదా పన్ను నోటీసులకు దారితీయవచ్చని వారు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి