ఇక కొనలేమా.! 12 రోజుల్లో ఇన్ని వేలా.. బంగారం ఎంత పెరిగిందో తెలుసా.?

పట్టుకోండి చూద్దాం అంటూ పరుగులు పెడుతోంది..బంగారం ధర. తగ్గేదేలేదంటూ లక్ష రూపాయల దిశగా దూసుకువెళ్తోంది. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి తప్పితే..కిందకి దిగిరావడం లేదు. తగ్గినా కూడా మరుసటి రోజు లేదా వరుసగా భారీగా పెరుగుతూ పోతోంది.

ఇక కొనలేమా.! 12 రోజుల్లో ఇన్ని వేలా.. బంగారం ఎంత పెరిగిందో తెలుసా.?
Gold Price

Updated on: Apr 12, 2024 | 8:54 PM

పట్టుకోండి చూద్దాం అంటూ పరుగులు పెడుతోంది..బంగారం ధర. తగ్గేదేలేదంటూ లక్ష రూపాయల దిశగా దూసుకువెళ్తోంది. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి తప్పితే..కిందకి దిగిరావడం లేదు. తగ్గినా కూడా మరుసటి రోజు లేదా వరుసగా భారీగా పెరుగుతూ పోతోంది. ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ రేట్లు అల్‌టైమ్‌ హైలో ఉన్నాయి. దీంతో కొనుగోలుదారులు.. అమ్మో బంగారం అనుకోవాల్సి వస్తోంది.

వాస్తవానికి స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ఉంటే..బంగారం ధరలు తక్కువగా ఉండాలి. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు బిన్నంగా ఉంది. స్టాక్‌ మార్కెట్లతో పోటీ పడి బంగారం రేట్లు రికార్డుల్ని సృష్టిస్తున్నాయి. స్టాక్స్‌ పడిపోతే బంగారం ధరలు మరింత పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకు కారణం మదుపరులు తమ పెట్టుబడులకు రక్షణగా గోల్డ్‌ను ఎంచుకోవడమే. అంతర్జాతీయ పరిణామాలే గోల్డ్‌రన్‌కు కారణమంటున్నారు విశ్లేషకులు.

సెంట్రల్‌ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలకు తోడు..వడ్డీ రేట్లపై యూఎస్ ఫెడ్ వైఖరి కారణంగానే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరుగుతున్నాయంటున్నారు. ముఖ్యంగా చైనా నుంచి పసిడికి గిరాకీ ఎక్కువగా ఉండడం కూడా రికార్డు గరిష్ఠానికి కారణమని చెబుతున్నారు. మన దేశంలో బంగారానికి భారీ డిమాండ్ ​ఉన్నా కూడా మనదగ్గర ఆ స్థాయిలో ఉత్పత్తి లేదు. దీంతో అంతర్జాతీయ దిగుమతులే ఆధారం. ఈ క్రమంలో అంతర్జాతీయ అనిశ్చితులే పుత్తడి ధర పెరిగేందుకు కారణమవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్సు గోల్డ్ రేటు ఏకంగా 2 వేల 410 డాలర్లకు చేరింది. 2025 నాటికి ఈ ధర 3 వేల డాలర్లకు చేరుకోవచ్చని బ్యాంక్ ఆఫ్‌ అమెరికా అంచనా వేస్తోంది. అదే జరిగితే మనదేశంలో బంగారం ధర లక్షకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారమంటే భారతీయలకు లోహం కాదు..అదొక సెంటిమెంట్‌. పిసరంత బంగారమైనా ఇంట్లో ఉండాలన్నది 140 కోట్ల ఇండియన్ల కామన్ సెంటిమెంట్​. అందుకే ఒకప్పుడు అలంకార వస్తువుగా ఉండే బంగారం..నేడు అవసర వస్తువుగా మారింది. అంతే కాదు..బంగారం ఉంటే.. అదో నిశ్చింత. భవిష్యత్తుకు అదో భరోసా. బంగారాన్ని నమ్మినవారెవరూ నష్టపోరంటారు పెద్దలు.

దీంతో బంగారానికి ఎప్పుడూ డిమాండ్‌ పెరగడమే తప్ప తగ్గిన పరిస్థితులు లేవు. అయితే ఈ నెలలో పెళ్లిళ్లు, శుభకార్యాలు పెట్టుకున్న వాళ్లు.. పెరుగుతున్న బంగారం ధరలతో కంగారు పడుతున్నారు. అయితే వెయిట్‌ చేస్తే ఇంకా పెరుగుతుందేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. దీంతో ఇక ఏ మాత్రం ఆలస్యం చేసినా బంగారం రేటు అందనంత ఎత్తుకు వెళ్తుందన్న అంచనాలతో కొనుగోళ్ళకు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు వెండి ధరలు కూడా బంగారంతో పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌ మార్కెట్‌లో కిలో వెండిధర 83 వేల 772 రూపాయలుగా ఉంది. దీనికి జీఎస్టీ అదనం.

గత 10 ఏళ్లలో బంగారంపై పెట్టుబడి పెట్టినవాళ్లు భారీగానే లాభపడ్డారు. 2013లో స్వచ్ఛమైన 10 గ్రాముల పసిడి దాదాపు 29,000 వేల వద్ద ట్రేడ్‌ అయింది. ప్రస్తుతం అది 75 వేలు దాటింది. ఇక ట్రేడ్ విశ్లేషకులు సైతం బంగారంపై పాజిటివ్ ట్రెండ్స్‌ ఇస్తుండటంతో పసిడి ప్రియులు, బులియన్ మార్కెట్ ఇన్వెస్టర్లు గోల్డ్ పర్చేజ్‌ చేస్తున్నారు. అయితే బంగారం కొనేటప్పుడు నాణ్యత విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణలు.