Bharat Rice: ఆన్‌లైన్లో ‘భారత్ రైస్’! ఎప్పుడు? ఎక్కడ? అసలు విషయం ఏమిటంటే..

|

Feb 12, 2024 | 7:53 AM

కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరుతో నాణ్యమైన బియ్యాన్ని సబ్సిడీపై అందిస్తోంది. కేవలం కిలో రూ. 29కి అందిస్తోంది. ఈ క్రమంలో వీటికి డిమాండ్ బాగా ఏర్పడింది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఈ బియ్యం కోసం బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో ఈ బియ్యం ఈ-కామర్స్ వెబ్ సైట్లో కూడా అందుబాటులోకి వచ్చిందని చాలా ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమేనా?

Bharat Rice: ఆన్‌లైన్లో ‘భారత్ రైస్’! ఎప్పుడు? ఎక్కడ? అసలు విషయం ఏమిటంటే..
Bharat Rice
Follow us on

మన దేశంలో బియ్యం ధరలు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. ఒక ఏడాది కాలంలో దాదాపు 15శాతం బియ్యం రేట్లు పెరిగాయి. గతంలో రూ. 20, రూ. 30లకే ప్రీమియం క్వాలిటీ బియ్యం లభించేవి. అయితే ఇటీవల కాలంలో ఆ బియ్యం ధర కేజీ రూ. 50 నుంచి 60 మధ్య ఉంటోంది. ఇక టాప్ బ్రాండ్ల బియ్యం అయితే రూ. 60కి పైనే ఉంటోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరుతో నాణ్యమైన బియ్యాన్ని సబ్సిడీపై అందిస్తోంది. కేవలం కిలో రూ. 29కి అందిస్తోంది. ఈ క్రమంలో వీటికి డిమాండ్ బాగా ఏర్పడింది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఈ బియ్యం కోసం బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో ఈ బియ్యం ఈ-కామర్స్ వెబ్ సైట్లో కూడా అందుబాటులోకి వచ్చిందని చాలా ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమేనా? ఆన్ లైన్లో ఈ భారత్ రైస్ ను కొనుగోలు చేయొచ్చా? తెలుసుకుందాం రండి..

ఫుల్ డిమాండ్..

రెండ్రోజుల క్రితం కర్నాటకలోని కోలార్‌లో కేవలం రెండు గంటల్లోనే 10 టన్నుల బియ్యం అమ్ముడుపోవడంతో ఈ బియ్యానికి ఎంత డిమాండ్ ఉందో వెలుగులోకి వచ్చింది. బియ్యాన్ని రూ.29కి విక్రయిస్తున్నారనే వార్త తెలియడంతో ప్రజలు బైక్‌లు, ఆటోలు, కార్లలో వచ్చి 5, 10 కిలోల బస్తాలను కొనుగోలు చేశారు. కొద్దిసేపటికే మొత్తం స్టాక్‌లు అమ్ముడుపోవడంతో చాలా మంది రిక్తహస్తాలతో తిరిగొచ్చినట్లు నివేదికపేర్కొంది. దేశంలోని చాలా ప్రాంతాల నుంచి ఇదే రకమైన కథనాలు వస్తున్నాయి.

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) రెండు సహకార సంఘాలకు 5 లక్షల టన్నుల బియ్యాన్ని అందిస్తోంది. నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏఎఫ్ఈడీ), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీసీఎఫ్) లకు అందిస్తోంది. ఈ ఏజెన్సీలు 5 కిలోలు, 10 కిలోల ప్యాక్‌లలో బియ్యాన్ని ప్యాక్ చేస్తాయి. భారత్’ బ్రాండ్ కింద తమ అవుట్‌లెట్ల ద్వారా రిటైల్ చేస్తాయి. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా బియ్యాన్ని విక్రయించనున్నారు.

ఇవి కూడా చదవండి

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో ఉందా?

ఫిబ్రవరి 6న ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందున, నెటిజన్లు తమ అభిమాన ఈ-కామర్స్ సైట్‌లైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఇది అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవడానికి గూగ్లింగ్ చేయడం ప్రారంభించారు. ఈ రెండు ఇ-కామర్స్ సైట్‌లలో ప్రస్తుతానికి ‘భారత్ రైస్’ విక్రయించడం లేదు. జియో మార్ట్ వెబ్‌సైట్‌లో మాత్రం భారత్ రైస్ ను లిస్టింగ్ ఇచ్చింది. అయితే అమ్మకాలు మాత్రం ప్రారంభించలేదు. ఆర్డర్ చేయడానికి ప్రయత్నిస్తే మీరు ఎంచుకున్న ఉత్పత్తి అందుబాటులో లేదని నోటిఫికేషన్ వచ్చింది. బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతాతో సహా వివిధ పిన్ కోడ్‌ల ద్వారా బుకింగ్ చేసేందుకు పెద్ద ఎత్తున వినియోగదారులు ప్రయత్నించారు.

అంతేకాకుండా, నాఫెడ్ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఆన్‌లైన్ విక్రయం ప్రారంభం కాలేదు . కేంద్రం ఇప్పటికే ‘భారత్‌ ఆటా’ను కిలో రూ.27.50కి, ‘భారత్‌ దాల్’ (చానా) కిలో రూ.60కి విక్రయిస్తోంది. ‘భారత్ రైస్’ ప్రారంభోత్సవంలో, ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, సామాన్య ప్రజలకు రోజువారీ ఆహార పదార్థాలు సరసమైన ధరలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..